హైదరాబాద్‌లో బ్రిక్స్ సమావేశాలు
హైదరాబాద్‌కు రానున్న బ్రిక్స్ ప్రతినిధులు
బ్రిక్స్ కీలక భేటీ రేపటి నుంచి
భారత్ అధ్యక్షతన చర్చలు
హైదరాబాద్, ఆంధ్రప్రభ: బ్రిక్స్–2026కు భారత్ అధ్యక్షత వహిస్తున్న నేపథ్యంలో బ్రిక్స్ అవినీతి నిరోధక కార్యాచరణ బృందం (Anti-Corruption Working Group–ACWG) రెండో సమావేశం, అలాగే ఆస్తుల రికవరీపై బ్రిక్స్ నిపుణుల నెట్‌వర్క్ రెండో సమావేశం ఆగస్టు 4, 5 తేదీల్లో హైదరాబాద్‌లో జరగనున్నాయి. కేంద్ర ప్రభుత్వ సిబ్బంది, శిక్షణ విభాగం (DoPT) ఈ సమావేశాలకు ఆతిథ్యం ఇస్తోంది.
“స్థిరత్వం, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత కోసం నిర్మాణం” అనే బ్రిక్స్–2026 ఇతివృత్తానికి అనుగుణంగా ఈ సమావేశాలు నిర్వహించనున్నారు. కేంద్ర సిబ్బంది, శిక్షణ విభాగం కార్యదర్శి రచనా షా సమావేశాలను ప్రారంభించనున్నారు. బ్రిక్స్ సభ్య దేశాల ప్రతినిధులు, విధాన రూపకర్తలు, న్యాయ నిపుణులు, అవినీతి నిరోధక సంస్థలు, చట్ట అమలు సంస్థల ప్రతినిధులు ఇందులో పాల్గొననున్నారు.
ఈ ఏడాది జూన్ 2, 3 తేదీల్లో వర్చువల్‌గా నిర్వహించిన తొలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై హైదరాబాద్ సమావేశంలో విస్తృత చర్చలు జరగనున్నాయి. ముఖ్యంగా ఆస్తుల రికవరీ, సరిహద్దులు దాటి జరిగే అవినీతి నిరోధం, పారదర్శక పాలన, జవాబుదారీతనం పెంపు వంటి అంశాలపై సభ్య దేశాలు అభిప్రాయాలు పంచుకోనున్నాయి.
ప్రధాన చర్చాంశాలు
అవినీతి కేసుల్లో పరారీలో ఉన్న నేరస్తుల గుర్తింపు, అప్పగింత ప్రక్రియలో పరస్పర సహకారం.
ఆస్తుల రికవరీపై బ్రిక్స్ నిపుణుల నెట్‌వర్క్ ద్వారా సమాచార మార్పిడి, కార్యాచరణ సమన్వయం.
ఫిన్‌టెక్, డిజిటల్ ఆస్తులు, డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో ఉద్భవిస్తున్న అవినీతి ప్రమాదాలను ఎదుర్కొనే వ్యూహాలు.
సాంకేతికత ఆధారిత పారదర్శక పాలన, అవినీతి నిరోధక వ్యవస్థల బలోపేతం.
ఆగస్టు 5న “ఆవిష్కరణ, సాంకేతిక ఆధారిత వ్యవస్థల ద్వారా నైతిక పరిపాలన” అనే అంశంపై ప్రత్యేక అనుబంధ కార్యక్రమాన్ని కూడా నిర్వహించనున్నారు. డిజిటల్ ప్రభుత్వ కొనుగోళ్లు, పౌర భాగస్వామ్యం, పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంపొందించే వినూత్న సాంకేతిక విధానాలపై సభ్య దేశాలు తమ అనుభవాలను పంచుకోనున్నాయి.
భారత్ అధ్యక్షతన జరుగుతున్న బ్రిక్స్ సమావేశాల శ్రేణిలో ఇది చివరి సమావేశం కావడంతో, సభ్య దేశాల మధ్య అవినీతి నిరోధం, ఆస్తుల రికవరీ, సాంకేతిక ఆధారిత పరిపాలన, సంస్థాగత సామర్థ్య నిర్మాణంలో దీర్ఘకాలిక సహకారానికి ఈ సమావేశాలు బాటలు వేస్తాయని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.
