ఫేజ్-1 మళ్లీ మొదటికి?

మెట్రోపై ఆర్థిక ప్రతిబంధకాలు
ఐఆర్‌ఎఫ్‌సీ రుణానికి అడ్డంకులు
మెట్రో ప్రణాళికకు ఎదురుదెబ్బ
ఫేజ్-2పైనా అనిశ్చితి

హైదరాబాద్, ఆంధ్రప్రభ: హైదరాబాద్ మెట్రో రైలు ఫేజ్-1ను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకురావాలన్న తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక ప్రణాళికకు ఊహించని ఆటంకం ఎదురైనట్లు తెలుస్తోంది. నిధుల సమీకరణలో ఏర్పడిన ఇబ్బందులతో ఈ ప్రక్రియ మళ్లీ మొదటికి చేరిన పరిస్థితి నెలకొన్నట్లు సమాచారం. దీంతో పరిపాలనపరంగానే కాకుండా రాజకీయంగానూ ఈ అంశం ప్రభుత్వానికి సవాలుగా మారిందనే చర్చ సాగుతోంది.

గత ఏప్రిల్ 29న ఎల్‌అండ్‌టీ మెట్రో రైల్ హైదరాబాద్‌తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం సుమారు రూ.13,600 కోట్ల అప్పును రాష్ట్ర ప్రభుత్వం స్వీకరించి, మెట్రో ఫేజ్-1ను తన ఆధీనంలోకి తీసుకోవాలని నిర్ణయించింది.

ఈ అప్పును ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ (IRFC) నుంచి తక్కువ వడ్డీ రేటుతో రుణం తీసుకుని రీఫైనాన్స్ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ చర్యతో మెట్రో ప్రాజెక్టుపై ఉన్న ఆర్థిక భారం గణనీయంగా తగ్గుతుందని కూడా తెలిపింది.

అయితే, ఎల్‌అండ్‌టీకి చెందిన రూ.1,440 కోట్ల ఈక్విటీ వాటాను ప్రభుత్వం స్వీకరించడంతో పాటు, ఐఆర్‌ఎఫ్‌సీకి రూ.84.32 కోట్ల ప్రాసెసింగ్ ఫీజు చెల్లించినప్పటికీ ఆశించిన రుణం ఇప్పటివరకు మంజూరు కాలేదని సమాచారం.

రుణ చెల్లింపుల ప్రాధాన్యత అంశంలో తలెత్తిన భేదాభిప్రాయాల కారణంగా రుణ ప్రక్రియ నిలిచిపోయినట్లు తెలుస్తోంది. దీంతో ప్రభుత్వం ఇప్పుడు వాణిజ్య బ్యాంకుల ద్వారా ప్రత్యామ్నాయంగా రుణాలు సమీకరించే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం.

ఈ జాప్యం రాష్ట్రంపై అదనపు ఆర్థిక భారాన్ని మోపుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. మెట్రో అప్పులను ప్రభుత్వం స్వీకరించిన తర్వాత రోజుకు సుమారు రూ.2.5 నుంచి రూ.3 కోట్ల వరకు అదనపు వడ్డీ భారం పడుతోందని అంచనా వేస్తున్నారు. గత రెండు నెలల్లోనే ఈ భారం రూ.150 నుంచి రూ.180 కోట్ల వరకు పెరిగినట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు.

ఈ పరిణామాలు రూ.43 వేల కోట్ల వ్యయంతో ప్రతిపాదించిన హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 విస్తరణ ప్రాజెక్టుపైనా ప్రభావం చూపే అవకాశం ఉందని భావిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలకు ముందు ఫేజ్-1 స్వాధీనం, ఫేజ్-2 విస్తరణను ప్రభుత్వం ప్రధాన విజయాలుగా ప్రజల ముందుకు తీసుకురావాలని భావించినప్పటికీ, ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు ప్రాజెక్టు ఆర్థిక ప్రణాళిక, అమలుపై ప్రశ్నలు తలెత్తేలా చేస్తున్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.