ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం..

మరిపెడ, ఆంధ్రప్రభ : ప్రతి ఒక్కరి జీవితంలో స్నేహితుల పాత్ర కీలకం. ఆట పాటలు, చిలిపి పనులు, కష్టం, సుఖం ఇలా ఏదైనా కాని మన వెన్నంటే ఉండి నేనున్నాను అంటూ ధైర్యం చెప్పేదే ఒక స్నేహం. అందరి కన్నా మన జీవితంలో చెరగని ముద్ర వేసేది పదో తరగతి వరకు చదువుకున్న దోస్తులు.. వారితో ఉన్న జ్ఞాపకాలు ఎప్పటికి మరిచిపోనివి మరుపురానివి.. పదో తరగతి తర్వాత దూరమైన అలాంటి స్నేహితులను మళ్లీ 20 ఏళ్ల తర్వాత అందరు ఆత్మీయ సమ్మేళనం పేరుతో కలుసుకుంటే ఎంత ఆనందంగా ఉంటుందో.. అలా కలిసి జ్ఞాపకాలు నెమరవేసుకున్న వారే మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలోని మరిపెడ ఉన్నత పాఠశాలలో చదివిన 2005-2006 పదో తరగతి బ్యాచ్. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం అపూర్వంగా ఆదివారం ఘనంగా నిర్వహించారు.

ఆనందం, బాల్యం, స్మృతులు, కరచాలనాలు, చెమ్మగిల్లిన కళ్లతో ఆలింగనాలు, గురువుల మందలింపులు తలుచుకుంటూ ఒకసారి వయస్సు మరచిపోయి చిన్న పిల్లలా కేరింతలతో ఉన్నత పాఠశాల మరిపెడ ఆవరణం కోలాహలంగా మారింది. ఈ ప్రాంగణంలో అడుగు పెడుతూనే హోదాలను మరిచి ఒకరినొకరు ఆత్మీయంగా పలకరిస్తూ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. 20 సంవత్సరాల క్రితం తీపి జ్ఞాపకాలు, మధురస్మృతులను నెమరవేసుకుని కడుపుబ్బ నవ్వుకొని ఆనందపడ్డారు. సాయంత్రం వరకు ఉల్లాసంగా, ఉత్సాహంగా గడిపి సందడి చేశారు. అక్షరాలు నేర్పిన పాఠశాలలు పూర్వ విద్యార్థులకు మధురమైన జ్ఞాపకాలుగా ఉంటాయని మరిపెడ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థులు తమ మనోభావాలను వ్యక్త పర్చారు.

ముందుగా ఆనాడు విద్యా బోధన చేసి మృతి చెందిన గురువులు,అదే బ్యాచ్ లో మృతిచెందిన మిత్రులను స్మరించుకుంటూ రెండు నిముషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా గురువులు మాట్లాడుతూ..ప్రతి ఒక్కరూ సమాజంలో ఉన్నతమైన పేరు సంపాదించి, వారి పిల్లల భవిష్యత్ ను ఉన్నతంగా తీర్చిదిద్దాలని కోరారు. అనంతరం విద్యా బోధన చేసిన ఆనాటి గురువు, ప్రస్తుత పాఠశాల ఇంచార్జ్ హెచ్ఎం బయగాని రాంమోహన్, విశ్రాంత ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ భట్టార్, ఉపాధ్యాయులు వెంకటరాజు, అశోక్, వసుందర్, శ్రీదేవి, బయ్య ఉపేందర్, పోతుల గోవర్థన్, అటెండర్లు సంజీవ, ఏసయ్యలను శాలువా, జ్ఞాపికలతో సత్కరించారు. అనంతరం సహపంక్తి భోజనాలు చేశారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు షేక్ అన్వర్, వజ్జ సైదులు, గణేష్, ఐనాల నరేష్, బొజ్జ వీరన్న, రాంలాల్, సంతోష్, మంజుల, రాధిక, ఆసియా, మహేంద్ర, శిరీష, మంజుల, హరీష్, అనేష్, ఉపేందర్, సంజీవ, మునీందర్, సురేష్, నల్ల నరేష్, నసీర్, నరేష్ రెడ్డి, లింగన్న, రాజేశ్వరి, ముంతాజ్, శ్రీలత, రజిత, భారతి, జ్యోతి, నాగలక్ష్మి, వసంత, ఎలేంద్ర, రమాదేవి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply