Khammam | ప్రాణం తీసిన పెన్సిల్…

ఆంధ్రప్రభ : ఖమ్మం జిల్లాలో చోటుచేసుకున్న ఒక అత్యంత విషాదకర ఘటన స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. కూసుమంచి మండలం నాయకన్‌గూడెంలో పెన్సిల్ కారణంగా ఆరేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోవడం ఆ కుటుంబంలో తీరని శోకాన్ని నింపింది. వివరాల్లోకి వెళితే..
నాయకన్‌గూడెం గ్రామానికి చెందిన విహార్ (6) స్థానిక ప్రైవేటు పాఠశాలలో యూకేజీ చదువుతున్నాడు. బుధవారం మధ్యాహ్నం లంచ్ బ్రేక్ సమయంలో మూత్రశాలకు వెళ్లి తిరిగి పరుగెత్తుకుంటూ తరగతి గదిలోకి వస్తుండగా, ప్రమాదవశాత్తు కింద పడిపోయాడు.
ఆ సమయంలో బాలుడి చేతిలో ఉన్న పెన్సిల్ నేరుగా ఛాతిలో బలంగా గుచ్చుకోవడంతో తీవ్ర రక్తస్రావమై విహార్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు.
ఈ ప్రమాదాన్ని గమనించిన పాఠశాల సిబ్బంది వెంటనే 108 వాహనంలో కూసుమంచి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
పాఠశాలకు వెళ్లిన తమ కుమారుడు విగతజీవిగా మారడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. తోటి స్నేహితులతో ఆడుకుంటూ తరగతి గదికి వస్తున్న క్రమంలో జరిగిన ఈ చిన్న ప్రమాదం ప్రాణాంతకం కావడం అందరినీ కలిచివేసింది. ఈ ఘటనతో నాయకన్‌గూడెం గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.
