కేతన్ అగర్వాల్ హత్య కేసు.. నిందితులకు కఠిన శిక్ష తప్పదన్న ఫడ్నవీస్

ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : మహారాష్ట్రలో సంచలనం సృష్టించిన కేతన్ అగర్వాల్ హత్య కేసుపై ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు. కేతన్ అగర్వాల్‌ను అతని కాబోయే భార్య, ఆమె ప్రియుడు కలిసి లోహగడ్ కోట పైనుంచి తోసి చంపిన కేసు అందరికీ తెలిసిందే. ప్రేమ వ్యవహారం నేపథ్యంలో జరిగినట్లు భావిస్తున్న ఈ హత్య దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపింది. ఈ నేపథ్యంలో, బాధితుని కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఆయన హామీ ఇచ్చారు.

శుక్రవారం బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడిన ఫడ్నవీస్.. ఈ దారుణ ఘటనలో నిందితులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు. కేసులో బాధ్యులైన వారందరికీ చట్ట ప్రకారం అత్యంత కఠిన శిక్ష పడేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తుందని, దర్యాప్తును వేగంగా, పారదర్శకంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినట్లు వెల్లడించారు.

ఈ కేసులో ఇప్పటికే పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేయగా, నిందితులపై బలమైన ఆధారాలు సేకరిస్తున్నారు. బాధిత కుటుంబానికి పూర్తి న్యాయం జరిగే వరకు ప్రభుత్వం వెనుకడుగు వేయదని ఫడ్నవీస్ పునరుద్ఘాటించారు.