IND vs ENG | ఇంగ్లాండ్ పై దూకుడు.. భారత్ 244 పరుగుల ఆధిక్యం!

ఎడ్జ్‌బాస్టన్‌లో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో మూడో రోజు ఇంట్రెస్టింగ్ గా సాగింది. ఇంగ్లాండ్ బ్యాటర్లు బ్రూక్ – స్మిత్ రికార్డు భాగస్వామ్యం సాధించి సెంచరీలు నమోదు చేయగా, భారత బౌలర్లు కూడా దూకుడుగా ప్రత్యుత్తరం ఇచ్చారు. దీంతో ఇంగ్లాండ్ తమ తొలి ఇన్నింగ్స్ లో 407 పరుగుల వద్ద ఆలౌటవ్వగా.. మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 64/1తో నిలిచింది, ఇప్పటికే 244 పరుగుల ఆధిక్యంలో ఉండి విజయం వైపు మరింత బలంగా కదులుతోంది.
దంచేసిన బ్రూక్ – స్మిత్ !
భారత బౌలింగ్ కు ఆత్మవిశ్వాసం ఇచ్చిన సిరాజ్, రోజు ప్రారంభంలోనే భారత్ కు బ్రేక్ త్రూ ఇచ్చాడు. రెండో ఓవర్ లో జో రూట్ (22), బెన్ స్టోక్స్ (0) లను వరుస బంతుల్లో అవుట్ చేసి, ఇంగ్లాండ్ ను 84/5 స్కోరుతో పడగొట్టాడు.
కానీ ఆ తర్వాత ఆతిథ్య జట్టు నుండి అద్భుతమైన ప్రదర్శన వచ్చింది. హ్యారీ బ్రూక్ (158) – జేమీ స్మిత్ (184 నాటౌట్) ఆరో వికెట్‌కు 303 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి తమ ఇన్నింగ్స్ ను గట్టెక్కించారు. ఈ జంట సెంచరీలు చేయడమే కాకుండా భారత బౌలర్లపై తీవ్ర ఒత్తిడిని కూడా పెంచారు.
బ్రుక్ తన 158 పరుగులతో తన తొమ్మిదవ టెస్ట్ శతకాన్ని నమోదు చేయగా, జేమీ స్మిత్ కేవలం 80 బంతుల్లో శతకం నమోదు చేసి, ఇంగ్లాండ్ తరఫున టెస్టుల్లో వేగవంతమైన శతకాలు చేసిన మూడవ స్థానం లో నిలిచాడు. అతను చివరికి 184 నాటౌట్గా నిలిచి అలెక్ స్టీవర్ట్ రికార్డును అధిగమించి ఇంగ్లాండ్ వికెట్ కీపర్‌గా అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించాడు.
నిప్పులు విసిరిన అకాష్-సిరాజ్ !
ఇక రెండవ కొత్త బంతిని అందుకున్న తర్వాత, భారత బౌలింగ్ దళం తళుక్కుమంది. అకాష్ దీప్ 83వ ఓవర్‌లో బ్రుక్‌ను క్లీన్బౌల్డ్ చేయగా, ఆ తర్వాత అకాష్ దీప్ (4/88) – సిరాజ్ (6/70) కలిసి కేవలం 34 పరుగులకే చివరి ఐదు వికెట్లను తీసేశారు. వీరిద్దరూ కలిసి మొత్తంగా ఇంగ్లాండ్ 407 పరుగులకు ఆలౌట్ చేశారు.
రెండో ఇన్నింగ్స్ లో భారత్ దూకుడు
ఇక రెండో ఇన్నింగ్స్ ను భారత ఓపెనర్లు దూకుడుగా ప్రారంభించారు. యశస్వి జైస్వాల్ – కేఎల్ రాహుల్ వరుస బౌండరీలతో స్కోరు వేగంగా 51 పరుగుల వద్దకు చేర్చారు. అయితే జైస్వాల్ (28) ను జోష్ టంగ్ ఎల్బీడబ్ల్యూ అవుట్ చేశాడు. ఆ తరువాత వచ్చిన కరుణ్ నాయర్ (7)* – కేఎల్ రాహుల్ (28)* జాగ్రత్తగా ఆడుతూ వికెట్లు కోల్పోకుండా భారత్‌ను 64/1 వద్ద నిలిపారు. దీంతో ప్రస్తుతం భారత 244 పరుగుల లీడ్ లో నిలిచింది.
