- 12మంది చిన్నారులకు అస్వస్థత
(ఎ.కొండూరు, ఆంధ్రప్రభ) : అంగన్వాడీ కేంద్రంలో పౌష్టికాహారం తిని 12మంది చిన్నారులు తీవ్ర అస్వస్థత గురైన ఘటన తిరువూరు ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలోని ఎ.కొండూరు సెక్టార్ లోగల పెద్దతండా అంగన్వాడీ కేంద్రంలో చోటుచేసుకుంది.
ఈ విషయమై చిన్నారుల తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం… గురువారం ఉదయం ప్రతిరోజు మాదిరిగానే తమ పిల్లలను అంగన్వాడీ కేంద్రానికి పంపగా అక్కడ అంగన్వాడీ ఆయా వడ్డించిన (కార్యకర్త శిక్షణాల్లో ఉన్నందున) పౌష్టికాహారం తిన్న కొద్దిసేపటికే తమ పిల్లలు ఒక్కొక్కరికి వాంతులు విరోచనాలు అయ్యాయి. దాంతో చీమలపాడు గ్రామంలో ఉన్న ఆర్ఎంపి వైద్యుని చూపించగా అతని సలహా మేరకు అస్వస్థతకు గురైన తమ చిన్నారులను మైలవరం, విజయవాడ ఆస్పత్రులకు తరలించినట్లు తెలిపారు.
అప్పటివరకు ఎంతో ఉత్సాహంగా ఆడుకుంటున్న తమ పిల్లలు 12మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దింతో తమకు ఏం చేయాలో తెలియని పరిస్థితి నెలకొందని రోదిస్తూ తెలిపారు.
ఈ పరిస్థితులలో 108 వాహనానికి ఫోన్ ద్వారా సమాచారం అందించినప్పటికీ సకాలంలో రాకపోవడంతో ఆటోలో తరలించాల్సిన పరిస్థితి ఏర్పడిందని తల్లిదండ్రులు వాపోయారు.
అయితే, ఒకపక్క బర్డ్ ఫ్లూ వైరస్ ప్రజలు భయాందోళన చెందుతుండగా, అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు కోడిగుడ్లు ఎందుకు పెడుతున్నారని చిన్నారుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. గత రెండు రోజుల క్రితం ఎ.కొండూరు మండలంలోని కృష్ణారావు పాలెం పంచాయతీ శివారు దీప్లా నగర్ సమీపాన కోళ్ల ఫారంలో బర్డ్ ఫ్లూ వైరస్ తో సుమారు 3వేల కోళ్లు మృతి చెందాయని.. వారం రోజులు గడవకముందే అంగన్వాడీ కేంద్రాలలో చిన్నపిల్లలకు కోడిగుడ్లను ఎలా పెడుతున్నారని, అంగన్వాడీ అధికారుల తీరును చిన్నారుల తల్లిదండ్రులు బహిరంగం గానే విమర్శిస్తున్నారు. అస్వస్థత గురైన తమ పిల్లలు పూర్తిగా ఆరోగ్యవంతులుగా అయ్యేవరకు ప్రభుత్వమే చొరవ తీసుకొని కాపాడాలని చిన్నారుల తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు.
అంగన్వాడీ కేంద్రాల్లో కోడిగుడ్లను ఆహారంగా పెట్టడం మానుకోవాలని, చిన్నారులకు నాణ్యమైన పోషకాహారాన్ని అందించాలని బాల బాలికల తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు. సంఘటన స్థలాన్ని ఇన్చార్జ్ తహసీల్దార్ యు. రాజ్ కుమార్, దివ్య ప్రసాద్, వీఆర్వో, లక్ష్మయ్య, అంగన్వాడీ సూపర్వైజర్ టి.శివ కుమారి సందర్శించి వివరాలు సేకరించారు.