తిరుపతిలో తగ్గుతున్న చెరకు సాగు
చెరకు రైతులకు సాయం అందించాలని ఎంపీ గురుమూర్తి డిమాండ్
తిరుపతి, ఆంధ్రప్రభ వెబ్ డెస్క్: తిరుపతి జిల్లాలో చెరకు సాగు విస్తీర్ణం, ఉత్పత్తి క్రమంగా తగ్గిపోతుండడం ఆందోళనకరమని తిరుపతి ఎంపీ గురుమూర్తి పేర్కొన్నారు. చెరకు సాగు తగ్గుదలకు గల కారణాలు, రైతులకు అందిస్తున్న సహాయం, చెరకు పరిశ్రమ పునరుద్ధరణకు కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలపై మంగళవారం లోక్‌సభలో ప్రశ్నించారు. దీనికి కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి రామ్‌నాథ్ ఠాకూర్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.
గత ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని జిల్లాల వారీగా చెరకు సాగు విస్తీర్ణం, ఉత్పత్తి, దిగుబడి వివరాలను కేంద్ర ప్రభుత్వం సభకు సమర్పించింది. తిరుపతి జిల్లాలో చెరకు సాగు, ఉత్పత్తి తగ్గుముఖం పట్టినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయని మంత్రి తెలిపారు.
చెరకు ఉత్పత్తి పెంపు, సాగు పునరుద్ధరణ కోసం కేంద్ర ప్రభుత్వం పలు కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్) ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్‌కు అనువైన అధిక దిగుబడి, వ్యాధి నిరోధక లక్షణాలు కలిగిన Co09004 చెరకు రకాన్ని విడుదలకు సిద్ధం చేసినట్లు వెల్లడించారు.
జాతీయ ఆహార భద్రత, పోషకాహార మిషన్ ద్వారా రైతులకు శిక్షణ, సాంకేతిక పరిజ్ఞానం, ప్రదర్శన కార్యక్రమాలు నిర్వహిస్తూ చెరకు ఉత్పాదకత పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అలాగే వ్యవసాయ యాంత్రీకరణ ఉపమిషన్ కింద 2014-15 నుంచి 2026-27 వరకు ఆంధ్రప్రదేశ్‌కు రూ.955.28 కోట్లు విడుదల చేసినట్లు చెప్పారు. ఈ నిధులతో వ్యవసాయ యంత్రాలను సబ్సిడీపై పంపిణీ చేయడంతో పాటు కస్టమ్ హైరింగ్ సెంటర్లు, హైటెక్ హబ్‌లు, ఫార్మ్ మెషినరీ బ్యాంకులు ఏర్పాటు చేసినట్లు వివరించారు.
‘పర్ డ్రాప్ మోర్ క్రాప్’ పథకం ద్వారా డ్రిప్, స్ప్రింక్లర్ వంటి సూక్ష్మ సేద్యాన్ని ప్రోత్సహిస్తున్నట్లు మంత్రి తెలిపారు. చిన్న, సన్నకారు రైతులకు యూనిట్ వ్యయంలో 55 శాతం, ఇతర రైతులకు 45 శాతం వరకు ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు పేర్కొన్నారు.
ప్రతి పంట సీజన్‌కు చెరకు ఫెయిర్ అండ్ రిమ్యునరేటివ్ ప్రైస్ (FRP) ను కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుందని, ఆ ధర కంటే తక్కువకు చెరకు కొనుగోలు చేసే అవకాశం చక్కెర కర్మాగారాలకు లేదని స్పష్టం చేశారు.
అదేవిధంగా సహకార చక్కెర కర్మాగారాల ఆధునికీకరణ, పునరుద్ధరణ కోసం జాతీయ సహకార అభివృద్ధి సంస్థ (ఎన్సీడీసీ) ద్వారా 2023-24, 2024-25 ఆర్థిక సంవత్సరాల్లో రూ.10,005 కోట్ల రుణాలు మంజూరు చేసినట్లు వెల్లడించారు.
ఈ సందర్భంగా ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ, తిరుపతి జిల్లాలో చెరకు సాగు క్షీణత ఆందోళన కలిగించే అంశమని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పథకాల ప్రయోజనాలు జిల్లా రైతులకు పూర్తిస్థాయిలో అందేలా చర్యలు తీసుకోవాలని, చెరకు రైతులు, చక్కెర పరిశ్రమకు మరింత ప్రత్యేక సహాయం అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
