ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారంలో వేగం పెంచాలి: కలెక్టర్ హరిత
అర్జీలను క్షేత్రస్థాయిలో పరిశీలించి చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశం
ఆసిఫాబాద్, ఆంధ్రప్రభ : ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరితగతిన పరిష్కరించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కె. హరిత సూచించారు.
సోమవారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు యువరాజ్ మార్మాట్ (లోకల్ బాడీ), ఎం. డేవిడ్ (రెవెన్యూ), జిల్లా రెవెన్యూ అధికారి దాసరి వేణుతో కలిసి కలెక్టర్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు.
లింగాపూర్ మండలం పిట్టగూడ గ్రామానికి చెందిన గ్రామస్థులు వర్షాకాలంలో తాగునీటి సమస్య పరిష్కరించాలని వినతిపత్రం అందజేశారు. పెంచికల్పేట్ మండల ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 108 అంబులెన్స్ ఏర్పాటు చేయాలని మరో అర్జీ సమర్పించారు.
రెబ్బెన మండలం దేవలగూడ గ్రామంలో మూసివేసిన యూటర్న్‌ను తిరిగి ప్రారంభించాలని స్థానికులు కోరారు. దహేగాం మండలం కమ్మర్పల్లి గ్రామానికి చెందిన సజ్జాత్ అలీ ఖాన్ కుటుంబ భూమికి సంబంధించిన విరాసత్ హక్కుల పట్టా మార్పిడిని నిలిపివేయాలని దరఖాస్తు సమర్పించారు.
కెరమెరి మండలం సాంగ్వి గ్రామానికి చెందిన మొహర్లె రమేష్, 2024లో పూర్తి చేసిన సీసీ రోడ్డు పనులకు సంబంధించిన బకాయిలు చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. వాంకిడి మండలం గోయాగాం గ్రామంలోని తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దులో నాగదేవత భీమన్న గుడి సమీప జాతీయ రహదారిపై తొలగించిన బోర్వెల్ స్థానంలో కొత్త బోర్వెల్ ఏర్పాటు చేయాలని మరో దరఖాస్తు అందింది.
రెబ్బెన మండలం గంగాపూర్ గ్రామానికి చెందిన పుల్లుభాయి తన భూమిలో అటవీశాఖ అధికారులు మొక్కలు నాటుతామని బెదిరిస్తున్నారని, జాయింట్ సర్వే నిర్వహించి కొత్త పట్టా మంజూరు చేయాలని కోరారు. గోల్లేటి గ్రామానికి చెందిన జరుపుల జుమ్లి భాయి తన భర్త మరణంతో ఆయన పేరులో ఉన్న అటవీ భూమి హక్కు పత్రాన్ని తన పేరుపై మార్చాలని దరఖాస్తు చేశారు.
సిర్పూర్ మండలం మహాగావ్ గ్రామానికి చెందిన రాము రైతు భరోసా నిధులు జమ చేయాలని అర్జీ సమర్పించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ కె. హరిత మాట్లాడుతూ, ప్రజావాణిలో వచ్చిన ప్రతి దరఖాస్తును సంబంధిత శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, సమన్వయంతో త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
