సీజనల్ వ్యాధుల నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాలి
లోతట్టు ప్రాంతాల్లో పర్యటించిన బీజేపీ ఫ్లోర్ లీడర్ గాజుల ముఖేష్ గౌడ్
మంచిర్యాల, ఆంధ్రప్రభ: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా మంచిర్యాల పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్న నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జిల్లా అధికారులు, మున్సిపల్ శాఖ ముందస్తు చర్యలు చేపట్టాలని 57వ డివిజన్ కార్పొరేటర్, బీజేపీ ఫ్లోర్ లీడర్ గాజుల ముఖేష్ గౌడ్ కోరారు.
బుధవారం ఆయన 57వ డివిజన్‌తో పాటు పలు కాలనీల్లో పర్యటించి ఇళ్లలోకి వర్షపు నీరు చేరిన ప్రాంతాలను పరిశీలించారు. బాధితులను అప్రమత్తం చేస్తూ వారికి అవసరమైన సహాయ సహకారాలు అందించారు.
ఈ సందర్భంగా ముఖేష్ గౌడ్ మాట్లాడుతూ, మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉందన్నారు. గతంలో రాత్రికి రాత్రే ఇళ్లలోకి వరద నీరు చేరి భారీ నష్టం వాటిల్లిన ఘటనలను గుర్తుచేస్తూ, జిల్లా అధికారులు మంచిర్యాల పట్టణంపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు.
57వ డివిజన్లో ఉన్న సమస్యలను మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. వాటి పరిష్కారం కోసం తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో నాయకులు యాదగిరి, విజయ్, సతీష్, రాజారావు తదితరులు పాల్గొన్నారు.
