Fake-Attendance-Scam దొంగ హాజరు దందా..! Andhra Prabha Exclusive Story
Fake-Attendance-Scam దొంగ హాజరు దందా..! Andhra Prabha Exclusive Story
- రికార్డుల్లో డ్యూటీలు.
- వార్డుల్లో అదృశ్యం
- రోగుల బంధువులే బంట్రోతులు
- విజయవాడ జీజీహెచ్ లో అంతా మాయ
- అక్రమ వసూళ్లల్లో వారికి వారే సాటి
- బాధితుల గోడు వినని సూపర్ సార్

విజయవాడ న్యూ ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి (జీజీహెచ్)లో ఎఫ్‌ఎన్‌వోలు, ఎంఎన్‌వోల హాజరు నమోదులో భారీ అక్రమాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి. కాగితాలపై వంద మందికి పైగా సిబ్బంది విధుల్లో ఉన్నట్లు నమోదు చేస్తున్నప్పటికీ, వార్డుల్లో మాత్రం అవసరమైన సిబ్బంది కనిపించకపోవడంతో రోగు లు, వారి బంధువులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డ్యూటీకి రాని వారికి సైతం హాజరు నమోదు చేసి ప్రభుత్వ ఖజానాకు ప్రతి నెల నెల లక్షల రూపాయల నష్టం కలిగిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
(ఎన్టీఆర్ బ్యూరో, ఆంధ్రప్రభ)
రాష్ట్రంలోనే అత్యంత రద్దీగా ఉండే ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఒకటైన విజయవాడ న్యూ జీజీహెచ్‌లో పరిపాలనా లోపాలు, నకిలీ హాజరు నమోదు, అక్రమ వసూళ్ల ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. రోజూ వేలాది మంది పేద రోగులు చికిత్స కోసం ఆస్పత్రికి వస్తున్నప్పటికీ, అత్యవసర సమయంలో స్ట్రెచర్లు, వీల్‌చైర్లపై వార్డులకు తరలించేందుకు అవసరమైన సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో రోగుల బంధువులే ఆ బాధ్యతలు నిర్వర్తించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తమవుతోంది. అయితే ఆ బాధ్యతలు నిర్వహించాల్సిన సిబ్బంది మాత్రం కేవలం హాజరుకే పరిమితం అవుతూ, సేవలకు మాత్రం దూరంగా ఉంటున్నారు.
Fake-Attendance-Scamమూడు షిఫ్టుల్లో ..
ఆస్పత్రిలో మూడు షిఫ్టుల్లో కలిపి వంద మందికి పైగా ఎఫ్‌ఎన్‌వోలు, ఎంఎన్‌వోలు విధుల్లో ఉన్నట్లు రికార్డులు చెబుతున్నా, ప్రత్యక్షంగా విధుల్లో కనిపించేది 30 నుంచి 50 మంది మాత్రమేనని ఆరోపణలు ఉన్నాయి. మిగిలిన వారికి డ్యూటీకి హాజరు కాకపోయినా హాజరు రిజిస్టర్లలో సంతకాలు నమోదవుతున్నాయని, ఈ దొంగ అటెండెన్స్ ఆధారంగా ప్రతి నెలా లక్షల రూపాయల ప్రభుత్వ నిధులు దుర్వినియోగమవుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.
Fake-Attendance-Scam సంబంధం లేని జవాబు…
ఈ వ్యవహారంపై శానిటైజింగ్ ఇన్‌స్పెక్టర్ సోమరాజును ప్రశ్నించగా, కొందరు సిబ్బంది సంతకాలు చేయకుండానే వెళ్లిపోతుంటారని, అందుకే హాజరు నమోదు చేస్తున్నామని సమాధానం ఇచ్చినట్లు సమాచారం. అయితే విధులకు రాని వారికి ఎలా హాజరు నమోదు చేస్తున్నారన్న ప్రశ్నకు స్పష్టమైన వివరణ ఇవ్వలేదని తెలుస్తోంది. ఇదే అధికారి ఇటీవల కాంట్రాక్ట్ మహిళా కార్మికులను వేధించిన ఆరోపణల నేపథ్యంలో పాత జీజీహెచ్‌కు బదిలీ అయినట్లు సమాచారం.
Fake-Attendance-Scam : అక్రమ వసూలు..
మరోవైపు, ఐసీయూ, క్యాజువాలిటీ, కార్డియాలజీ వంటి కీలక విభాగాల్లో పనిచేస్తున్న కొందరు సీనియర్ సిబ్బంది డిశ్చార్జి, మృతదేహాల అప్పగింతల సమయంలో రోగుల బంధువుల నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంలో కొందరు అధికారుల సహకారం కూడా ఉందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Fake-Attendance-Scam : పారదర్శకత పాతర
జిజిహెచ్ లో బాధ్యతలు నిర్వహించే ఉదయం షిఫ్ట్ డ్యూటీ రోస్టర్లు, సిబ్బంది హాజరు వివరాలు, విధుల కేటాయింపులో పారదర్శకత లేకపోవడం, నకిలీ బిల్లులు, దొంగ హాజరు నమోదుపై ఆరోపణలు వస్తున్నప్పటికీ ఆస్పత్రి ఉన్నతాధికారులు సమర్థవంతమైన చర్యలు తీసుకోవడం లేదని రోగుల బంధువులు, ప్రజాసంఘాలు ఆరోపిస్తున్నాయి. దొంగ హాజరు, అక్రమ వసూళ్లు, ప్రభుత్వ నిధుల దుర్వినియోగం ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి, వాస్తవాలను వెలుగులోకి తీసుకువచ్చి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజాసంఘాలు, రోగుల బంధువులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
