Covid | కరోనాతో వణికిపోతున్న అమెరికా.. వేల‌ల్లో కేసులు … వందల్లో మరణాలు!

కాలిఫోర్నియా – అగ్రరాజ్యం అమెరికా లో కరోనా మహమ్మారి మరోసారి పంజా విసిరింది. కొవిడ్-1 వేగంగా వ్యాపిస్తూ ఆందోళన కలిగిస్తుండగా, వందల సంఖ్యలో మరణాలు నమోదవుతుండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ముఖ్యంగా కొత్తగా వెలుగులోకి వచ్చిన ఎన్బీ.1.8.1 వేరియంట్ ఈ ఉద్ధృతికి ప్రధాన కారణమని నిపుణులు భావిస్తున్నారు. మరోవైపు, భారతదేశంలో కూడా కొవిడ్ కేసులు పెరుగుతున్నప్పటికీ, వ్యాధి తీవ్రత తక్కువగా ఉండటం కొంత ఊరటనిచ్చే అంశం.

పెరుగుతున్న మరణాల సంఖ్య
గత నెల రోజులుగా అమెరికాలో ప్ర‌తి రోజు వంద‌కు పైగా కోవిడ్ కేసులు న‌మోద‌వుతున్నాయి. ఇక వారానికి సగటున 350 వరకు కొవిడ్ మరణాలు నమోదవుతున్నాయని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ మరణాల సంఖ్య భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం అమెరికాలో నమోదవుతున్న కొవిడ్ కేసుల్లో అత్యధికం ఎన్బీ.1.8.1 వేరియంట్ వల్లనేనని సీడీసీ వెల్లడించింది. చైనాతో పాటు ఇతర ఆసియా దేశాల్లో కూడా ఈ వేరియంట్ కారణంగానే కేసులు పెరుగుతున్నట్లు సమాచారం.

ప్రతిరోజూ కొత్త వేరియంట్ కేసులు
పిల్లలు, వయసు పైబడిన వారు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ఈ వైరస్ ప్రాణాంతకంగా మారుతోందని నిపుణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాషింగ్టన్, కాలిఫోర్నియా, న్యూయార్క్ సిటీ, వర్జీనియా వంటి రాష్ట్రాల్లో ప్రతిరోజూ కొత్త వేరియంట్ కేసులు బయటపడుతున్నాయని అధికారులు తెలిపారు. విమానాశ్రయాల్లో విదేశీ ప్రయాణికులకు నిర్వహిస్తున్న పరీక్షల్లో చైనా, జపాన్, దక్షిణ కొరియా, ఫ్రాన్స్ తదితర దేశాల నుంచి వస్తున్న వారిలో ఈ ఎన్బీ.1.8.1 వేరియంట్‌ను గుర్తిస్తున్నారు.

భారత్‌లోనూ పెరుగుతున్న కేసులు
భారతదేశంలో కూడా కొవిడ్ కేసుల సంఖ్యలో పెరుగుదల కనిపిస్తోంది. గత మంగ‌ళ‌వారం నాటికి దేశవ్యాప్తంగా 1,017 కొత్త కేసులు నమోదయ్యాయి. అయినప్పటికీ, ప్రజలు భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని వైద్య నిపుణులు భరోసా ఇస్తున్నారు. అప్రమత్తంగా ఉంటూ, సాధారణ నివారణ చర్యలు పాటిస్తే సరిపోతుందని వారు స్పష్టం చేస్తున్నారు.ప్రధానంగా కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో కేసులు ఎక్కువగా నమోదవుతున్నప్పటికీ, గత కొవిడ్ వేవ్‌లతో పోలిస్తే ప్రస్తుత ఇన్ఫెక్షన్ల సంఖ్య చాలా తక్కువగానే ఉందని వైద్యులు తెలిపారు. కొవిడ్ బారిన పడుతున్న వారిలో వ్యాధి తీవ్రత కూడా తక్కువగా ఉంటోందని, అత్యధిక శాతం మంది రోగులకు ఓపీడీ (ఔట్ పేషెంట్ డిపార్ట్‌మెంట్)లోనే చికిత్స అందించి పంపిస్తున్నామని వెల్లడించారు.

అనవసరంగా ఆందోళన వద్దు
దగ్గు, గొంతు నొప్పి లేదా ఫ్లూ వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే ఇళ్లకే పరిమితమై వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు. రోగనిరోధక శక్తి తక్కువగా ఉందని వైద్యులు నిర్ధారించి, సూచిస్తే తప్ప మిగిలిన వారు బూస్టర్ డోస్ తీసుకోవాల్సిన అవసరం లేదని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *