ప్రభుత్వ ధాన్యం అక్రమాలకు అడ్డుకట్ట వేయాలి

రైస్‌మిల్లులపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలని జోగు అరవింద్‌రెడ్డి డిమాండ్

గరిడేపల్లి, ఆంధ్రప్రభ : రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా రైస్‌మిల్లులు పుట్టగొడుగుల్లా వెలుస్తుండగా, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించిన ధాన్యం అక్రమంగా పక్కదారి పడుతోందని పోనుగోడు గ్రామ ఉప సర్పంచ్ జోగు అరవింద్‌రెడ్డి ఆరోపించారు.

ఆదివారం గరిడేపల్లి మండల కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పర్యవేక్షణలో ఉన్న ధాన్యం కూడా అక్రమ వ్యాపారానికి గురవడం ఆందోళన కలిగించే విషయమన్నారు.

రైతుల నుంచి మద్దతు ధరపై కొనుగోలు చేసిన ధాన్యాన్ని రైస్‌మిల్లులకు తరలించిన తర్వాత నిబంధనల ప్రకారం కస్టమ్ మిల్ల్డ్ రైస్ (సీఎంఆర్) ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉండగా, కొందరు మిల్లర్లు దానిని బహిరంగ మార్కెట్‌లో విక్రయిస్తూ ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం కలిగిస్తున్నారని ఆరోపించారు.

ఇటీవల రాష్ట్రంలోని పలు జిల్లాల్లో విజిలెన్స్, పౌర సరఫరాల శాఖల తనిఖీల్లో ప్రభుత్వ ధాన్యం అక్రమ నిల్వలు, అక్రమ రవాణా ఘటనలు వెలుగులోకి వచ్చినప్పటికీ, అక్రమాలకు పూర్తిస్థాయిలో అడ్డుకట్ట పడడం లేదన్నారు.

రైస్‌మిల్లులకు అనుమతులు మంజూరు చేసే దశ నుంచే కఠిన నిబంధనలు అమలు చేయాలని, ప్రభుత్వ ధాన్యం కేటాయించే ముందు ఆయా మిల్లుల సామర్థ్యం, గత పనితీరు, రికార్డులను సమగ్రంగా పరిశీలించాలని సూచించారు. సంబంధిత అధికారులు సమర్థవంతమైన పర్యవేక్షణ చేపడితే అక్రమాలను గణనీయంగా నియంత్రించవచ్చని అన్నారు.

కొనుగోలు కేంద్రాల నుంచి మిల్లులకు చేరిన ప్రభుత్వ ధాన్యాన్ని పూర్తిస్థాయిలో సీఎంఆర్‌గా తిరిగి ఇవ్వకుండా బహిరంగ మార్కెట్‌లో విక్రయిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం సరఫరా చేసే 40 కిలోల ధాన్య బస్తాలను 70 కిలోల బస్తాలకు మార్చి అక్రమ రవాణా చేస్తున్నారని పేర్కొన్నారు.

తనిఖీల్లో లారీలు పట్టుబడిన సందర్భాల్లో రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేసిన ధాన్యమని చెప్పి తప్పించుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. కొంతమంది మిల్లులు నిబంధనలకు విరుద్ధంగా కార్యకలాపాలు కొనసాగిస్తున్నప్పటికీ సంబంధిత శాఖల పర్యవేక్షణలో లోపాలు ఉన్నాయని విమర్శించారు.

ప్రభుత్వ ధాన్యం అక్రమాలకు పాల్పడుతున్న మిల్లులపై విజిలెన్స్, పౌర సరఫరాల శాఖలు, సంబంధిత అధికారులు సంయుక్తంగా ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలని జోగు అరవింద్‌రెడ్డి డిమాండ్ చేశారు. రైతుల ప్రయోజనాలు, ప్రభుత్వ ఆదాయాన్ని పరిరక్షించేందుకు అక్రమాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

పర్మిషన్ల మంజూరు నుంచి ధాన్యం కేటాయింపు వరకు పూర్తి పారదర్శకత పాటిస్తే అక్రమాలకు అడ్డుకట్ట పడుతుందని, నిబంధనలు ఉల్లంఘిస్తున్న రైస్‌మిల్లులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.