కోదండరామస్వామి ఆలయ సేవలకు గౌరవం
గంపలగూడెం, ఆంధ్రప్రభ: మండలంలోని ఊటుకూరు గ్రామానికి చెందిన పద్మనాభుని సర్వేశ్వరరావుకు అరుదైన గౌరవం లభించింది. ఆయనకు ఏపీ శ్రీ కోదండరామస్వామి ఉత్తమ ఆలయ చైర్మన్ పురస్కారం ప్రదానం చేశారు.
ఆదివారం సికింద్రాబాద్లోని హరిహర కళాభవన్లో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ సువర్ణ కంకణ అవార్డుల కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని ఆయన అందుకున్నారు. లలిత కళా సమాఖ్య సామాజిక, సేవా, సాంస్కృతిక సంస్థ, రుద్రాక్ష వైభవం ఆధ్యాత్మిక పీఠం ఆధ్వర్యంలో వివిధ రంగాల్లో విశిష్ట సేవలు, ప్రతిభ కనబరిచిన వ్యక్తులను ఎంపిక చేసి సత్కరించారు.
ఊటుకూరు గ్రామంలోని శ్రీ కోదండరామస్వామి దేవాలయంలో గత కొన్నేళ్లుగా పద్మనాభుని సర్వేశ్వరరావు నిర్వహిస్తున్న ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ఉత్సవాల నిర్వహణ, భక్తి సేవా కార్యక్రమాలకు చేసిన విశేష కృషిని గుర్తించి ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.
ఈ అవార్డును రుద్రాక్ష వైభవం అధ్యక్షుడు డాక్టర్ శ్రీ కృష్ణ చాముండేశ్వరి మహర్షి, ఎమ్మెల్సీ దయానంద గుప్తా, సినీ నటుడు జనార్ధనరావు, సీవీ రామన్ అకాడమీ ప్రధాన కార్యదర్శి, నిర్వాహకుడు మహేంద్రవాడ వెంకటేశ్వరరావు సంయుక్తంగా పద్మనాభుని సర్వేశ్వరరావుకు అందజేశారు.
పురస్కారం అందుకున్న సందర్భంగా సర్వేశ్వరరావు మాట్లాడుతూ.. ఈ గౌరవం తన వ్యక్తిగత గుర్తింపు మాత్రమే కాదని, ఊటుకూరు గ్రామ ప్రజలు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు, సేవా కార్యక్రమాల్లో భాగస్వాములైన ప్రతి ఒక్కరి సహకారానికి లభించిన గుర్తింపు అని అన్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు, వివిధ సామాజిక, ఆధ్యాత్మిక సంస్థల ప్రతినిధులు అభినందనలు తెలిపారు.
