ప్రకృతి వ్యవసాయ అమలు పరిశీలన…
ప్రకృతి వ్యవసాయ అమలు పరిశీలన…
- కేతనకొండలో వ్యవసాయ క్షేత్రాలను సందర్శించిన అమెరికా ప్రతినిధి బృందం
ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రభుత్వం రైతు సాధికార సంస్థ (ఆర్ వైఎస్ఎస్) ఆధ్వర్యంలో అమలు చేస్తున్న ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ మేనేజ్‌డ్ నేచురల్ ఫార్మింగ్ (ఏపీసీఎన్ఎఫ్) కార్యక్రమాన్ని పరిశీలించేందుకు అమెరికాలోని వాషింగ్టన్‌కు చెందిన బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ ప్రతినిధి బృందం మంగళవారం కేతనకొండ గ్రామాన్ని సందర్శించింది. ఈ బృందానికి మిస్టర్ నీల్ వాట్కిన్స్ నాయకత్వం వహించారు. కేతనకొండలో ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను సందర్శించి, రైతులు అమలు చేస్తున్న విధానాలను పరిశీలించారు.
ముఖ్యంగా బొప్పాయి, అరటి పంటలు, ప్రీ-మాన్సూన్ డ్రై సోయింగ్ (పీఎండీఎస్) మోడల్ క్షేత్రాలను ప్రత్యక్షంగా చూశారు. అలాగే ఇన్‌పుట్ డెమోన్స్ట్రేషన్, ప్రకృతి వ్యవసాయ స్టాళ్లు, బయో రిసోర్స్ సెంటర్‌ను సందర్శించి, బయో ఇన్‌పుట్ తయారీ విధానాలు – వాటి వినియోగంపై అవగాహన పొందారు. ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల ట్రేసబిలిటీ, సర్టిఫికేషన్ విధానం గురించి అధికారులు వివరాలు అందించారు. ఈ సందర్భంగా అగ్రిగేటర్లు, మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులతో ప్రతినిధి బృందం పరస్పర చర్చలు నిర్వహించింది, అనంతరం రైతు సేవా కేంద్రం (ఆర్ఎస్కే)ను సందర్శించి రైతులకు అందుతున్న సేవలు, ప్రకృతి వ్యవసాయ విస్తరణ చర్యల గురించి తెలుసుకున్నారు.
జిల్లా పర్యటన అనంతరం అమరావతిలోని సచివాలయంలో ఆర్టీజీఎస్ కార్యాలయంలో రాష్ట్ర స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించనున్నారు. ఈ పర్యటనలో జిల్లా ప్రాజెక్టు మేనేజర్ వై.శంకర్ నాయక్, డిప్యూటీ డైరెక్టర్ అర్నవ్ కపూర్, సీనియర్ ప్రోగ్రామ్ ఆఫీసర్ శైలేంద్ర హెగ్డే, సిద్ధార్థ్ చతుర్వేది, డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ మేనేజర్ ఎస్.ప్రవీణ్, సీనియర్ కన్సల్టెంట్ ఆలమూరు సౌమ్య, ప్రాజెక్టు కో – ఆర్డినేటర్ ఎన్.డి.ఆర్.కె.శర్మ, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు.
