ఆనందోత్సాహాల నడుమ సుదర్శన్‌రెడ్డి జన్మదిన వేడుకలు
సేవా కార్యక్రమాలతో ప్రత్యేకంగా నిర్వహించిన కాంగ్రెస్ శ్రేణులు
ఎడపల్లి, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, బోధన్ ఎమ్మెల్యే ప్రొద్దుటూరి సుదర్శన్‌రెడ్డి జన్మదిన వేడుకలను ఎడపల్లి మండల వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆదివారం ఘనంగా నిర్వహించారు.
కాంగ్రెస్ పార్టీ ఎడపల్లి మండల అధ్యక్షుడు పులి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో సేవా కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టారు.
జన్మదిన వేడుకల్లో భాగంగా జానకంపేటలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో కాంగ్రెస్ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి ఆయురారోగ్యాలతో ప్రజాసేవ కొనసాగించాలని స్వామివారిని ప్రార్థించారు.
అనంతరం ఎడపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందుతున్న రోగులకు పండ్లు పంపిణీ చేశారు. అలాగే మండల కేంద్ర శివారులోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)లో విద్యార్థినులకు పండ్లు పంపిణీ చేసి శుభాకాంక్షలు తెలిపారు.
తదుపరి ఎడపల్లి మండల కేంద్రంలోని మంగళ్ పహాడ్ చౌరస్తాలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కేక్ కట్ చేసి ఒకరికి ఒకరు మిఠాయిలు తినిపించుకుంటూ జన్మదిన వేడుకలను ఉత్సాహంగా జరుపుకున్నారు.
అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో మండల వ్యాప్తంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పులి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా నిరంతరం పనిచేస్తున్న నాయకుడు ప్రొద్దుటూరి సుదర్శన్‌రెడ్డి అని కొనియాడారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే నాయకుడిగా ఆయన ప్రత్యేక గుర్తింపు పొందారని అన్నారు.
బోధన్ నియోజకవర్గ అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి ఆయన చేస్తున్న సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. సుదర్శన్‌రెడ్డి మరెన్నో జన్మదినాలు ఆరోగ్యంగా, ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల, గ్రామ స్థాయి నాయకులు, వివిధ గ్రామాల సర్పంచులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళా నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
