‘పే బ్యాక్ టు సొసైటీ’ స్ఫూర్తితో సమాజానికి సేవ చేయాలి
యాదవ హాస్టల్ నిర్మాణానికి ఆర్థిక సహకారం అందించాలని పిలుపు
మహబూబ్‌నగర్ రూరల్, ఆంధ్రప్రభ : యాదవ సమాజ అభ్యున్నతికి విద్యావంతులు ‘పే బ్యాక్ టు సొసైటీ’ స్ఫూర్తితో ముందుకు వచ్చి సేవ చేయాలని యాదవ విద్యావంతుల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ బైకని బాలు యాదవ్ పిలుపునిచ్చారు.
యాదవ విద్యావంతుల వేదిక జిల్లా కార్యవర్గ సమావేశం జిల్లా అధ్యక్షుడు జుర్రు నారాయణ యాదవ్ అధ్యక్షతన ఆదివారం ఏనుగొండ రామదూత టౌన్‌షిప్‌లోని జిల్లా కార్యాలయంలో నిర్వహించారు.
ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా యాదవ విద్యావంతుల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ బైకని బాలు యాదవ్, అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర కార్యదర్శి వై. రవికుమార్ యాదవ్ హాజరయ్యారు.
డాక్టర్ బైకని బాలు యాదవ్ మాట్లాడుతూ బీసీ వర్గాల్లో అధిక సంఖ్యలో ఉన్న యాదవులు రాజకీయంగా, సామాజికంగా మరింత బలోపేతం కావాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో శ్రీకృష్ణ యాదవ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న యాదవ హాస్టల్ భవనానికి యాదవులు ఉదారంగా ఆర్థిక సహకారం అందించాలని కోరారు.
అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర కార్యదర్శి వై. రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ జిల్లాలో రాజకీయ, విద్యా రంగాల్లో ముందుకు వస్తున్న యాదవ యువతను ప్రోత్సహిస్తూ వారి అభ్యున్నతికి సహకరించాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్మిస్తున్న యాదవ హాస్టల్ భవనానికి సాయిబాబా యాదవ్ (విద్యుత్ శాఖ) రూ.1 లక్ష, ముద్దం పద్మ యాదవ్ రూ.25 వేలు, విష్ణువర్ధన్ యాదవ్ రూ.25 వేలు, వెంకటరాములు యాదవ్ రూ.11 వేలు, మద్దిలేటి యాదవ్ రూ.10 వేలు విరాళంగా ప్రకటించారు.
తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన డాక్టర్ బైకని బాలు యాదవ్‌ను యాదవ విద్యావంతుల వేదిక జిల్లా శాఖ ఘనంగా సన్మానించింది. అలాగే ఇటీవల పదవీ విరమణ చేసిన సాయిబాబా యాదవ్, వెంకటనారాయణ యాదవ్, వెంకటరాములు యాదవ్, బాలయ్య యాదవ్‌తో పాటు బీజేపీ నాగర్‌కర్నూల్ జిల్లా మహిళా అధ్యక్షురాలిగా ఎన్నికైన ముద్దం పద్మ యాదవ్‌ను కూడా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో యాదవ విద్యావంతుల వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు పి. అంజన్న యాదవ్, జిల్లా గౌరవ అధ్యక్షుడు భరత్‌కుమార్ యాదవ్, జిల్లా ప్రధాన కార్యదర్శి గోదా తిరుపతయ్య యాదవ్, జిల్లా ఉపాధ్యక్షులు మద్దిలేటి యాదవ్, గుడిసె యాదయ్య యాదవ్, జగన్మోహన్ యాదవ్, దేవరకద్ర నియోజకవర్గ అధ్యక్షుడు బత్తుల మల్లేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
