మానవత్వం చాటుకున్న ఎస్సై విజయ్, కాంగ్రెస్ నాయకుడు మహేందర్

రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించి ప్రాణాపాయం నుంచి కాపాడిన ఘటన

ఉట్నూర్, ఆంధ్రప్రభ : ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండల కేంద్రంలోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకు సమీపంలోని చిత్రునగర్ వద్ద ఆదివారం ఓ ద్విచక్ర వాహనం అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో గాయపడిన గుర్తుతెలియని వ్యక్తి రోడ్డుపై అపస్మారక స్థితిలో పడి ఉండగా ఉట్నూర్ ఎస్సై విజయ్, కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు కొత్తపల్లి మహేందర్ అటుగా వెళ్తూ గమనించారు.

వెంటనే స్పందించిన వారు బాధితుడిని ఆసుపత్రికి తరలించేందుకు 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. అయితే అంబులెన్స్ అందుబాటులో లేదని తెలియడంతో కాంగ్రెస్ నాయకుడు కొత్తపల్లి మహేందర్ తన సొంత వాహనంలో క్షతగాత్రుడిని ఉట్నూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందేలా చర్యలు తీసుకున్నారు.

ఆపదలో ఉన్న వ్యక్తికి వెంటనే సహాయం చేయడం మానవత్వానికి నిదర్శనమని ఎస్సై విజయ్ అన్నారు. ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్నవారికి సకాలంలో సహాయం అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని సూచించారు.

రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని ఆలస్యం చేయకుండా ఆసుపత్రికి తరలించిన ఎస్సై విజయ్, కాంగ్రెస్ నాయకుడు కొత్తపల్లి మహేందర్ సేవలను స్థానికులు అభినందించారు.