ఆ గ్రామాలకు వెళ్లాలంటే నరకయాతనే..
- పిఎంజిఎస్ వై కింద బీటి రోడ్డు మంజూరైన అటవీ అనుమతులు లేక రద్దు
- ఏటేటా అవస్థలు పడుతున్న ఆ గిరిజన గ్రామాల ప్రజలు
- హామీలు తప్ప పట్టించుకోని ప్రజాప్రతినిధులు అధికారులు
జైనూర్, ఆంధ్రప్రభ : రోడ్లు లేని గ్రామాలకు రోడ్లు మంజూరు చేస్తామని ప్రజలకు రవాణా సౌకర్యం మెరుగుపరుస్తామని ప్రజా ప్రతినిధులు ప్రతి ఎన్నికల్లో హామీలు ఇస్తున్నారు తప్ప రోడ్ల నిర్మాణ విషయంలో పట్టించుకోవడంలేదని మారుమూల గిరిజన గ్రామాల ప్రజలు ఆవేదన చెందుతున్నారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనురు మండలంలోని మారుమూల గ్రామపంచాయతీ అయినా చింత కర్ర పంచాయతీకి 2017 -18 లో పి ఎం జి ఎస్ వై పథకం కింద కెరమెరి ఘాట్ ప్రాంతం నుండి కిషన్ నాయక్ తండ వరకు 8 కిలోమీటర్ల బిటి రోడ్డు నిర్మాణానికి రెండు కోట్ల 20 లక్షల రూపాయలు మంజూరు చేశారు.

ఆ రోడ్డు పనులకు టెండర్లు కూడా జరిగి రోడ్డు పనులను అప్పటి ఎమ్మెల్యే కోవలక్ష్మి శంకుస్థాపన చేశారు. కాంట్రాక్టర్ పనులు ప్రారంభించిన రోజే అటవీ శాఖ అనుమతులు లేవని అటవీ అధికారులు ఆ రోడ్డుపనులను అడ్డుకొని నిలిపివేశారు. ఆ రోడ్డు నిర్మాణానికి దాదాపు ఆరు సంవత్సరాలు కావడంతో మంజూరైన బి టి రోడ్డు నిధులు రద్దు అయ్యాయని తెలిసింది. చింత కర్ర పంచాయతీలోని చింతకర్ర తాటి కూడా కిషన్ నాయక్ తండ మూడు గిరిజన గ్రామాలకు మట్టి రోడ్డు ఉండడంతో వర్షాకాలంలో గుంతలు ఏర్పడి అద్వానంగా మారడంతో ఆ రోడ్డుపై ఆ గ్రామాల గిరిజనులు ప్రయాణించాలంటే నరకయాతన పడుతున్నారు.
ప్రస్తుతం మట్టి రోడ్డు ఉండడంతో వర్షాలకు రోడ్డుపై గుంతలు ఏర్పడి బురుదమయంగా మారడంతో వాహనాలు సరిగా ఎలక అనేక ఇబ్బందులు పడుతున్నట్లు ఆ మూడు గిరిజన గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అటవీ అనుమతులు తీసుకోకపోవడం వల్లనే ఆ గ్రామాలకు మంజూరైన బీటీ రోడ్డు వేయలేకపోయారని ఆయా గ్రామాల పెద్దలు నాయక్ లు పేర్కొంటున్నారు. ఆ గ్రామాలు ఏర్పడి ఏండ్లు గడుస్తున్న రోడ్డు సరిగా లేక ప్రతి ఏడాది వర్షాకాలంలో నాలుగు నెలలు అనేక ఇబ్బందులు పడుతున్నామని ఆ మూడు గ్రామాల గిరిజన ప్రజలు ఆవేదన వ్యక్తం చెందుతున్నారు.
ప్రతి ఎన్నికల్లో ప్రజాప్రతినిధులు నాయకులు ప్రచారానికి వచ్చినప్పుడల్లా మీ గ్రామాలకు ప్రధాన సమస్య రోడ్డు ఉందని దాన్ని నిర్మించేందుకు కృషి చేస్తామని హామీలు ఇస్తూ ఎన్నికల్లో గెలిచిన తర్వాత విస్మరిస్తున్నారని ఆయా గ్రామాల గిరిజన నాయకులు గిరిజనులు పేర్కొంటున్నారు. మా పంచాయతీకి రోడ్డు నిర్మాణం జరిగేటప్పుడు ఇబ్బందులు తప్పేది ఎప్పుడు అని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆరోగ్య సమస్యలు అత్యవసర పరిస్థితిలో తలెత్తినప్పుడు వాహనాలు వెళ్ళక దాదాపు 8 కిలోమీటర్లు కాలినడకన వచ్చి మండల కేంద్రానికి రావాల్సి వస్తుందని ప్రజలు పేర్కొంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అయినా రోడ్డు నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని ఇబ్బందులు తొలిగేలా నూతన బీటీ రోడ్డు నిర్మించాలని ఆ మూడు గ్రామాల గిరిజనులు కోరుతున్నారు.
రోడ్డు నిర్మాణానికి కృషి చేస్తా
సర్పంచ్ జాదవ్ విట్టల్

చింత కర్ర పంచాయతీలోని చింతకర తాటి కూడా కిషన్ నాయక్ తండ గ్రామాలకు బీటీ రోడ్డు నిర్మాణం జరిగేలా కృషి చేస్తానని చింతకర్ర పంచాయితీ నూతన సర్పంచ్ జాదవ్ విట్టల్ పేర్కొన్నారు. సంవత్సరాల తరబడి మట్టి రోడ్డు ఉండడంతో వర్షాకాలంలో బురదమయంగా గుంతల మయంగా ఏర్పడి పంచాయతీలోని మూడు గ్రామాల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఈ విషయాన్ని ప్రజాప్రతిని దృష్టికి తీసుకువెళ్లి తన హాయంలో రోడ్డు నిర్మించేలా కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. ప్రజా ప్రతినిధులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నత అధికారులు తమ మారుమూల గ్రామాల ప్రజల ఇబ్బందులు తొలిగేలా బీటీ రోడ్డు మంజూరు చేయాలని ఆయన కోరారు. వ
ర్షాకాలంలో ఈ రోడ్డుపై ప్రయాణం చేయాలంటే అనేక ఇబ్బందులు పడుతున్నామని తమ ఇబ్బందులను గమనించి రోడ్డు నిర్మించేలా చర్యలు తీసుకోవాలని ఆయన ప్రజాప్రతినిధులకు, ఉన్నతాధికారులకు కోరారు. ఈ రోడ్డు విషయంలో ప్రభుత్వ దృష్టికి తీసుకు వెళ్లేలా కృషి చేస్తానని చింత కర్ర సర్పంచ్ జాదవ్ విట్టల్ పేర్కొన్నారు. తమ పంచాయతీలోని గ్రామాలకు ప్రధాన సమస్య రోడ్డు ఉందని త్రాగునీరు విద్యుత్ సౌకర్యం కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టుటకు రోడ్డు సరిగా లేక వాహనాలు నడవక ఇబ్బందులు అవుతున్నాయని సర్పంచ్ తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో వైద్య సేవల కోసం 108 వాహనాలు కూడా తమ గ్రామాలకు రాలేకపోతున్నాయని దీంతో వైద్య సేవలు పరంగా కూడా ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆయన పేర్కొన్నారు.
