అత్యంత వైభవంగా ఇందూరు ఊర పండుగ
ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ
నిజామాబాద్, ఆంధ్రప్రభ : నగరంలో అత్యంత వైభవంగా నిర్వహించిన సాంప్రదాయ ఇందూరు ఊర పండుగలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణతో పాటు బీజేపీ కార్పొరేటర్లు పాల్గొన్నారు.
నగరంలోని పలు దేవాలయాలను సందర్శించిన ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా శివశక్తుల పూనకాలు, పోతురాజుల విన్యాసాలు, సంప్రదాయ కళారూపాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
వేలాది మంది భక్తులతో కలిసి ఎమ్మెల్యే పండుగ ఉత్సవాల్లో పాల్గొని ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఇందూరు ఊర పండుగ నగర ప్రజల ఐక్యతకు, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తోందన్నారు. ఈ పండుగను ప్రతి సంవత్సరం భక్తిశ్రద్ధలతో నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ కార్పొరేటర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
