కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా కోనాపూర్ ప్రభుత్వ పాఠశాల

కమ్మర్‌పల్లి, ఆంధ్రప్రభ : కమ్మర్‌పల్లి మండలం కోనాపూర్ ఉన్నత పాఠశాలలో కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా సౌకర్యాలు ఉన్నాయని, గత 15 సంవత్సరాలుగా పదో తరగతిలో 100 శాతం ఉత్తీర్ణత సాధిస్తోందని నిజామాబాద్ జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి రాజ గంగారాం అన్నారు. శనివారం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మండల ప్రత్యేక అధికారిగా కోనాపూర్ ఉన్నత పాఠశాలను పరిశీలించిన ఆయన పాఠశాల పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, ఉపాధ్యాయులు విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధతో బోధిస్తున్నారని తెలిపారు. వెనుకబడిన విద్యార్థులకు రెమిడియల్ తరగతులు, వ్యక్తిగత బోధన అందిస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో త్వరలో కంప్యూటర్ విద్యను ప్రారంభిస్తామని, విద్యార్థుల సంఖ్య పెరిగేలా కృషి చేయాలని సూచించారు.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో కూడిన కంప్యూటర్ విద్యను అభ్యసించడం ద్వారా విద్యార్థులకు భవిష్యత్తులో మెరుగైన ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. తాను కూడా ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివి ఈ స్థాయికి చేరుకున్నానని పేర్కొన్నారు. కోనాపూర్ పాఠశాలలో ఉన్నత విద్యార్హతలు కలిగిన, పోటీ పరీక్షల ద్వారా ఎంపికైన ఉపాధ్యాయులు సేవలందిస్తున్నారని తెలిపారు.

గ్రామ సర్పంచ్ అరుణ్ రెడ్డి మాట్లాడుతూ, పాఠశాల అభివృద్ధికి అవసరమైన సహాయ సహకారాలను గ్రామపంచాయతీ తరఫున అందిస్తామని చెప్పారు. ప్రైవేట్ పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలలో చేరే విద్యార్థుల ఇంటి పన్నును ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి తన సొంత ఖర్చులతో చెల్లిస్తానని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో కమ్మర్‌పల్లి మండల అభివృద్ధి అధికారి సదాశివ్, పంచాయతీ కార్యదర్శి నవీన్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.