ఐకేపీ మహిళా సంఘం భవన నిర్మాణ పనుల పరిశీలన..
భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ : నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని భీమ్‌గల్ మండలం చేంగల్ గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఐకేపీ మహిళా సంఘం వివో భవనం బేస్‌మెంట్ పనులు పూర్తయ్యాయి. మంగళవారం గ్రామ సర్పంచ్ దుమాల మమత (రాజు) నిర్మాణ పనులను పరిశీలించి, నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ మిగిలిన పనులను వేగంగా పూర్తి చేయాలని సూచించారు. గ్రామపంచాయతీ పరిధిలో రూ.10 లక్షల వ్యయంతో మహిళా సంఘానికి శాశ్వత భవనం నిర్మిస్తున్నామని, ఇప్పటికే బేస్‌మెంట్ పనులు పూర్తయ్యాయని సర్పంచ్ తెలిపారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, స్వయం సహాయక సంఘాల బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. మహిళా సంఘాల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, శాశ్వత భవనాల నిర్మాణం మహిళల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుందని పేర్కొన్నారు. మహిళా సంఘాల సభ్యులు ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలకు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.
