కన్నీరు పెట్టుకున్న హరీష్ రావు,

తెలంగాణ ఉద్యమ యోధుడు పెద్ది సుదర్శన్ రెడ్డికి అపూర్వ ప్రజానీరాజనం,
వేలాదిగా తరలివచ్చిన జనసంద్రం..
పార్టీలకు అతీతంగా అశ్రునివాళులు..
చరిత్రలో నిలిచిపోయేలా అంతిమయాత్ర,

నర్సంపేట, ఆంధ్రప్రభ : నర్సంపేట చరిత్రలో అరుదుగా కనిపించే జనసంద్రానికి శనివారం సాక్ష్యమిచ్చింది. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని ప్రజల్లో నింపిన ఉద్యమకారుడు, మాజీ ఎమ్మెల్యే, ప్రజానాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డికి వేలాది మంది అశ్రునయనాలతో తుది వీడ్కోలు పలికారు. నర్సంపేట వీధులన్నీ జనంతో నిండిపోగా, ప్రతి అడుగులోనూ విషాదం, ప్రతి హృదయంలోనూ ఆవేదన స్పష్టంగా కనిపించింది. పల్లె నుంచి పట్టణం వరకు, రైతు నుంచి విద్యావంతుల వరకు, యువత నుంచి వృద్ధుల వరకు ప్రతి వర్గం స్వచ్ఛందంగా అంతిమయాత్రలో పాల్గొని తమ అభిమాన నాయకుడికి నివాళులర్పించారు.

రాజకీయ భేదాలను పక్కనబెట్టి కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, సీపీఐ, సీపీఎం, తెలంగాణ రక్షణ సేనతో పాటు వివిధ రాజకీయ పార్టీల నాయకులు ఒకే వేదికపై నిలబడి పెద్ది సుదర్శన్ రెడ్డి సేవలను స్మరించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బీసీ కుల సంఘం జిల్లా అధ్యక్షుడు సోల్తి సారయ్య, సీపీఎం నాయకుడు భూక్య సమ్మయ్య, తదితరులు ఘనంగా నివాళులర్పించారు.

మాజీ మంత్రి హరీశ్ రావు, కేటీఆర్, మంత్రి సీతక్క, ప్రకాష్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, చల్లా ధర్మారెడ్డి, శంకర్ నాయక్, గోగుల రాణా ప్రతాప్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు తదితర ప్రముఖులు హాజరై పార్థివదేహానికి పుష్పాంజలి ఘటించారు. తెలంగాణ ఉద్యమంలో పెద్ది సుదర్శన్ రెడ్డితో కలిసి పోరాడిన సహచరులు ఆయన సేవలను గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు.

నర్సంపేట,దుగ్గొండి, నల్లబెల్లి, చెన్నారావుపేట, నెక్కొండ, ఖానాపురం, కొత్తగూడెం మండలాలతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లా నలుమూలల నుంచి వివిధ రాష్ట్రాలలో ఉద్యోగం చేస్తున్న వివిధ పనులలో ఉన్నటువంటి అభిమానులు, బంధువులు, స్నేహిగాట్తులు, మహిళా సంఘాలు, యువజన సంఘాలు, వ్యాపారవేత్తలు, న్యాయవాదులు, వైద్యులు, ఉద్యోగులు, ప్రభుత్వ అధికారులు, విద్యాసంస్థల ప్రతినిధులు, మాజీ, ప్రస్తుత ప్రజాప్రతినిధులు, వివిధ రకాల వ్యాపారస్తులు, విద్యా సంస్థల యాజమాన్యాలు పెద్ది సుదర్శన్ రెడ్డి మీద అభిమానంతో స్వతంత్రంగా బందు వారు వారికి వారే ప్రకటించుకుని పెద్ద ఎత్తున హాజరై అశ్రునివాళులు అర్పించారు.

“పెద్ది అమర్ హై”, “జై తెలంగాణ” నినాదాలతో నర్సంపేట మారుమోగింది. తెలంగాణ ఉద్యమానికి అంకితమైన జీవితం, ప్రజల కోసం నిరంతర పోరాటం, అందరికీ అందుబాటులో ఉండే నాయకత్వం, నిస్వార్థ ప్రజాసేవ ఆయనను ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలబెట్టాయని పలువురు పేర్కొన్నారు.

అంతిమయాత్రలో కనిపించిన అపూర్వ జనసందోహం ఒక నాయకుడికి ప్రజల హృదయాల్లో ఉన్న స్థానం ఎంత గొప్పదో మరోసారి చాటి చెప్పింది. పెద్ది సుదర్శన్ రెడ్డి భౌతికంగా దూరమైనా, ఆయన ఆశయాలు, సేవలు, పోరాట స్ఫూర్తి తెలంగాణ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచి ఉంటాయని ప్రతి ఒక్కరూ భావోద్వేగంతో స్మరించారు.