CWG 2026 | భారత్‌కు బాక్సింగ్‌లో మరో స్వర్ణం..
ఆంధ్రప్రభ: కామన్వెల్త్ క్రీడలు-2026లో భారత క్రీడాకారులు పతకాల వేట కొనసాగిస్తున్నారు. మహిళల 57 కిలోల బాక్సింగ్ విభాగంలో జైస్మిన్ లాంబోరియా స్వర్ణ పతకం సాధించి భారత్‌కు ఏడో గోల్డ్ అందించింది. ఫైనల్లో నార్తర్న్ ఐర్లాండ్‌కు చెందిన మైఖేలా వాల్ష్‌పై జైస్మిన్ విజయం సాధించి స్వర్ణాన్ని కైవసం చేసుకుంది.
అంతకుముందు మహిళల 54 కిలోల విభాగంలో ప్రీతి పవార్ కెనడాకు చెందిన స్కార్లెట్ డెల్గాడోపై ఏకగ్రీవ నిర్ణయంతో విజయం సాధించి స్వర్ణ పతకం గెలుచుకుంది. దీంతో బాక్సింగ్‌లో భారత్‌కు రెండు స్వర్ణాలు దక్కాయి.
కామన్వెల్త్ క్రీడల పదో రోజు భారత్‌కు శుభారంభంగా నిలిచిన ఈ విజయాలతో స్వర్ణాల సంఖ్య 7కు చేరింది. బాక్సింగ్‌లో ఇంకా తొమ్మిది మంది భారత బాక్సర్లు ఫైనల్స్‌లో పోటీపడనుండగా, మరిన్ని పతకాలపై ఆశలు నెలకొన్నాయి. జూడో, అథ్లెటిక్స్ విభాగాల్లోనూ భారత క్రీడాకారులు పతకాల కోసం బరిలోకి దిగనున్నారు.
త్రిపుల్ జంప్‌లో పతకాలు..
అథ్లెటిక్స్‌లోనూ భారత్ ఖాతాలో మరో రెండు పతకాలు చేరాయి. పురుషుల ట్రిపుల్ జంప్‌లో ప్రవీణ్ చిత్రవేల్ రజత పతకం సాధించగా, సెల్వ ప్రభు తిరుమారన్ కాంస్య పతకం కైవసం చేసుకున్నాడు. దీంతో కామన్వెల్త్ క్రీడల్లో భారత్ పతకాల వేట విజయవంతంగా కొనసాగుతోంది.
