చేనుల్లో నీళ్లు లేవు.. రైతన్న కళ్లల్లోనే నీరు..!
- వర్షాల కోసం రైతన్న ఎదురుచూపు
- వర్షం చుక్కలు లేక ట్యాంకర్ల ద్వారా నీరు
- పట్టణ, గ్రామాలలో రైతుల హరిగోస
పరకాల, (ఆంధ్రప్రభ): ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనప్పటికీ ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. చేనుల్లో నీరు లేక, విత్తిన విత్తనాలు మొలకెత్తకపోవడంతో రైతన్న కళ్లల్లోనే నీరు తిరుగుతున్న పరిస్థితి నెలకొంది.
పరకాల పరిసర ప్రాంతాల్లో ఇప్పటివరకు కురిసిన చిరుజల్లులు సాగుకు ఏమాత్రం సరిపోకపోవడంతో వ్యవసాయ పనులు నిలిచిపోయాయి. సుమారు 80 శాతం మంది రైతులు ఇప్పటికే విత్తనాలు విత్తినా, వర్షాలు లేక అవి మొలకెత్తకుండా పురుగుల పాలవుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రోజూ మేఘాలు కమ్ముకుంటున్నప్పటికీ ఒక్క వర్షపు చుక్క కూడా పడకపోవడంతో రైతులు ఆకాశం వైపు ఆశగా ఎదురుచూస్తున్నారు. వర్షాలపై ఆశ వదులుకోలేని రైతులు కొందరు ట్యాంకర్ల ద్వారా నీటిని తెప్పించి పొలాలకు అందించే ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ అది సాగుకు సరిపోవడం లేదని చెబుతున్నారు.
ఇప్పటికే వ్యవసాయ క్షేత్రాల్లోని బావులు, బోర్లలో నీటి మట్టం అడుగంటుతుండడంతో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. సాగుకు అవసరమైన నీరు లేకపోవడంతో పంటలు దెబ్బతింటాయనే భయంతో రైతులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు.
ఖరీఫ్ సీజన్లో ఆశించిన వర్షాలు కురవకపోతే పంటలు పూర్తిగా దెబ్బతిని తెలంగాణలో పలు ప్రాంతాలు కరువు పరిస్థితులను ఎదుర్కొనే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే పరిస్థితిని సమీక్షించి రైతులకు అవసరమైన సహాయం అందించాలని వారు కోరుతున్నారు.
