విద్యార్థులను అవమానించారంటూ సీఎం రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్
వ్యాఖ్యలు వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని గంట రవికుమార్ కోరింపు
హనుమకొండ ప్రతినిధి, ఆంధ్రప్రభ: తెలంగాణ విద్యార్థులను అవమానించేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ, ఆయన వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని వరంగల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు గంట రవికుమార్ డిమాండ్ చేశారు. సీఎం తన వ్యాఖ్యలను బహిరంగంగా వెనక్కి తీసుకుని విద్యార్థి లోకానికి క్షమాపణ చెప్పాలని కోరారు.
ఈ మేరకు శనివారం వరంగల్ నగరంలోని వెంకట్రామ థియేటర్ జంక్షన్‌లో బీజేపీ, బీజేవైఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు ఎర్రగోల్ల భరత్ వీర్ నాయకత్వంలో కార్యకర్తలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా గంట రవికుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం విద్యార్థుల త్యాగాలు, ఉద్యమాల ఫలితంగా ఏర్పడిందని గుర్తు చేశారు. అలాంటి రాష్ట్రంలో ముఖ్యమంత్రి విద్యార్థులను కించపరిచే విధంగా మాట్లాడటం బాధ్యతారాహిత్యమని విమర్శించారు. తెలంగాణ ఇంజనీరింగ్ విద్యార్థులను, యువతను అవమానించేలా చేసిన వ్యాఖ్యలు వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని అన్నారు.
ప్రపంచవ్యాప్తంగా తెలంగాణకు చెందిన విద్యార్థులు, ఇంజనీర్లు తమ ప్రతిభతో రాష్ట్రానికి గుర్తింపు తీసుకొస్తున్నారని, అలాంటి వారిని ముఖ్యమంత్రి తక్కువ చేసి మాట్లాడటం సమంజసం కాదని పేర్కొన్నారు. విద్యార్థుల మనోభావాలను దెబ్బతీసిన సీఎం వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
అలా చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు, యువతను ఏకం చేసి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. విద్యార్థుల హక్కుల పరిరక్షణ కోసం బీజేపీ, బీజేవైఎం ఎల్లప్పుడూ పోరాటం కొనసాగిస్తాయని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ అజ్మీర సీతారాం నాయక్, మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వన్నాల వెంకటరమణ, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రత్నం సతీష్ షా, జిల్లా పదాధికారులు, బీజేవైఎం నాయకులు, బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు.
