Nara Lokesh | ఎర్ర బస్సు రాదన్న చోటుకు ఎయిర్‌బస్సు వచ్చింది..!

  • భోగాపురంతో కొత్త యుగం
  • ఉత్తరాంధ్రకు రెక్కలిచ్చిన భోగాపురం
  • భోగాపురం… అభివృద్ధి ప్రతీక
  • ఉత్తరాంధ్రకు కొత్త దిశ
  • భోగాపురంతో ప్రపంచ పటంలో ఉత్తరాంధ్ర
  • ఎయిర్‌పోర్టుతో మారనున్న ఉత్తరాంధ్ర భవిష్యత్తు


Nara Lokesh | విజయనగరం, ఆంధ్రప్రభ: భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్ర భవిష్యత్తును మార్చే అభివృద్ధి చిహ్నమని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేశ్ అన్నారు. విమానాశ్రయ ప్రారంభోత్సవ సభలో ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌తో కలిసి పాల్గొన్న ఆయన ఉత్తేజభరితంగా ప్రసంగించారు.

ఒకప్పుడు “ఎర్రబస్సు కూడా రాని ఊరు” అని ఎగతాళి చేసిన వారికి ఈరోజు భోగాపురం విమానాశ్రయం గట్టి సమాధానమిచ్చిందన్నారు. “ఎర్రబస్సు రాదన్న చోట ఎయిర్‌బస్ వచ్చింది… ఎయిర్‌పోర్టు వచ్చింది… ఏకంగా ప్రధాని మోదీ వచ్చారు. ఇదీ ఉత్తరాంధ్ర దెబ్బ” అంటూ వ్యాఖ్యానించారు.

ఉత్తరాంధ్రకు స్వాతంత్య్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు గర్వకారణమైతే, ఈ ప్రాంత అభివృద్ధి కలలకు రెక్కలు ఇచ్చింది ప్రధాని నరేంద్ర మోదీ అని అన్నారు. భోగాపురం విమానాశ్రయం రైతుల త్యాగం, కార్మికుల కష్టం, ముఖ్యమంత్రి చంద్రబాబు విజన్‌కు ప్రతిరూపమని పేర్కొన్నారు.

రాష్ట్ర విభజన తర్వాత కష్టాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ను ప్రధాని మోదీ అన్ని విధాలా ఆదుకున్నారని లోకేశ్ చెప్పారు. పోలవరం, అమరావతి, విశాఖ రైల్వే జోన్, విశాఖ ఉక్కు, భారీ పెట్టుబడులు, గూగుల్ డేటా సెంటర్, ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్, ఏఎంసీఏ ఫైటర్ జెట్ ప్రాజెక్టు వంటి కీలక అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్రం అండగా నిలిచిందన్నారు.

మోదీ విజన్, చంద్రబాబు కార్యాచరణ కలయికే డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అని పేర్కొన్న ఆయన, భోగాపురం విమానాశ్రయం ఉత్తరాంధ్రను ప్రపంచ పెట్టుబడుల కేంద్రంగా మార్చబోతోందన్నారు. జీఎంఆర్ సంస్థ అధినేత గ్రంధి మల్లికార్జునరావు రికార్డు సమయంలో విమానాశ్రయ నిర్మాణాన్ని పూర్తి చేసి జన్మభూమి రుణం తీర్చుకున్నారని ప్రశంసించారు. కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కృషిని కూడా అభినందించారు.

ఉత్తరాంధ్ర ఒకప్పుడు వలసలకు ప్రతీకగా ఉండేదని, ఇప్పుడు ఉద్యోగాలు, ఉపాధి, పెట్టుబడులకు కేంద్రంగా మారుతోందన్నారు. ఇకపై ఉత్తరాంధ్ర యువత ఉద్యోగాల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేదని, అవకాశాలే ఇక్కడికి వస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు.