కాళేశ్వరాన్ని దోపిడీ కేంద్రంగా మార్చారు..
- ఆలయ నిధులతో ఎన్నికల రాజకీయాలు సాగిస్తున్నారంటూ పుట్ట మధుకర్ ఫైర్..
- పుష్కరాల కోసం కొనుగోలు చేసిన చీరలను ఎన్నికల కోసం పంచుతున్నారని ఆరోపణ
- ఆలయ నిధుల వినియోగం వివరాలను విడుదల చేయాలని డిమాండ్..
- స్థానిక పురోహితులను విస్మరించడం అన్యాయమని ఆగ్రహం.
భూపాలపల్లి రూరల్, ఆంధ్రప్రభ : దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయాన్ని అవినీతి, రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ తీవ్ర ఆరోపణలు చేశారు. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఆయన సతీమణి దేవాదాయ శాఖ కార్యదర్శి శైలజ రామయ్యర్, కుటుంబ సభ్యులు ఆలయ ప్రతిష్ఠకు భంగం కలిగించే విధంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ధన్వాడలో జరిగిన ఎల్లమ్మ ఆలయ ప్రారంభోత్సవంలో పంపిణీ చేసిన చీరలు కాళేశ్వరం పుష్కరాల కోసం ఆలయ నిధులతో కొనుగోలు చేసినవేనని ఆయన ఆరోపించారు.
పుష్కరాల కోసం సేకరించిన చీరలు, కిట్లను ఎన్నికల సమయంలో ఓటర్లను ఆకర్షించేందుకు నిల్వ ఉంచి పంపిణీ చేస్తున్నారని అన్నారు. పవిత్రమైన దేవాలయానికి సంబంధించిన వస్తువులను రాజకీయ అవసరాలకు వినియోగించడం అత్యంత దురదృష్టకరమని పేర్కొన్నారు. ఆలయ నిధుల వ్యయం, కొనుగోళ్ల వివరాలను సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) ద్వారా కోరినా, సుప్రీంకోర్టు మార్గదర్శకాల పేరుతో అధికారులు సమాచారం ఇవ్వకుండా తప్పించుకుంటున్నారని పుట్ట మధుకర్ ఆరోపించారు. సుప్రీంకోర్టు ఆలయ ఆస్తుల భద్రతకు సంబంధించిన వివరాలు మాత్రమే వెల్లడించవద్దని చెప్పిందని, కానీ ఆదాయం, వ్యయాల వివరాలను దాచిపెట్టే అధికారం ఎవరికీ లేదన్నారు.
ఆలయ నిధుల వినియోగంపై ప్రభుత్వం వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం ఆలయంలో గంగా హారతి వంటి కార్యక్రమాలకు స్థానిక వేదపండితులను పక్కనబెట్టి ఇతర రాష్ట్రాల నుంచి పురోహితులను తీసుకువచ్చి లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారని ఆయన విమర్శించారు. స్థానిక అర్చకులకు అవకాశం కల్పించకుండా బయటివారికి ప్రాధాన్యం ఇవ్వడం వెనుక కూడా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు. కాళేశ్వరం ఆలయం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మాత్రమే కాకుండా తెలంగాణ ఆధ్యాత్మిక వైభవానికి ప్రతీక అని, అలాంటి ఆలయాన్ని రాజకీయాలు, అవినీతితో ముడిపెట్టడం ప్రజలు సహించబోరని హెచ్చరించారు.
ఆలయ పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, ప్రజలు కూడా చైతన్యవంతులై ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. మంత్రి కుటుంబం ఆలయ వ్యవహారాలపై ప్రజలకు పూర్తి వివరణ ఇవ్వాలని, ఆలయ నిధులను రాజకీయ అవసరాలకు వినియోగించకుండా చర్యలు తీసుకోవాలని పుట్ట మధుకర్ డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రతిష్ఠకు మచ్చ తెచ్చే చర్యలు కొనసాగితే ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో మంతినికి సంబంధించిన బిఆర్ఎస్ నాయకులు అలాగే భూపాలపల్లికి సంబంధించిన బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు
