పే స్కేల్ కోసం వీబీజీ–రామ్ జీ ఉద్యోగుల పెన్‌డౌన్ కొనసాగింపు
కలెక్టరేట్ ఎదుట ధర్నా.. డిమాండ్లు నెరవేరే వరకు ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం
పెద్దపల్లి రూరల్, ఆంధ్రప్రభ: వేతన శ్రేణి (పే స్కేల్) మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ వీబీజీ–రామ్ జీ (ఉపాధి హామీ పథకం) ఉద్యోగులు శనివారం కూడా పెన్‌డౌన్, షట్‌డౌన్ నిరసన కార్యక్రమాలను కొనసాగించారు. రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు పెద్దపల్లి కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఉద్యోగులు మాట్లాడుతూ, వీబీజీ–రామ్ జీ పథకం అమలుతో పాటు గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడంలో తాము కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నప్పటికీ, ఇప్పటి వరకు తగిన వేతన శ్రేణి కల్పించకపోవడం వల్ల తీవ్ర ఆర్థిక, సామాజిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించి పే స్కేల్ మంజూరు చేయాలని కోరారు. సమస్య పరిష్కారమయ్యే వరకు శాంతియుతంగా పెన్‌డౌన్, షట్‌డౌన్ ఆందోళనలను కొనసాగిస్తామని జిల్లా జేఏసీ చైర్మన్ బొంగాని వెంకటేష్ గౌడ్ తెలిపారు.
అదనపు ప్రోగ్రామ్ ఆఫీసర్ల సంఘం అధ్యక్షుడు సదానందం, ఇంజినీరింగ్ కన్సల్టెంట్ల సంఘం అధ్యక్షుడు అయూబ్, కంప్యూటర్ ఆపరేటర్ల సంఘం అధ్యక్షురాలు తోడుపునూరి సుజాత మాట్లాడుతూ ఉద్యోగుల సేవలకు తగిన గుర్తింపుగా పే స్కేల్‌ను ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
