లబ్ధిదారుల ఇంటి వద్దకే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు..
- చిత్తూరు జిల్లాలో రూ.100.35 కోట్ల పంపిణీ ప్రారంభం
చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఎన్‌టీఆర్ భరోసా పింఛన్ పథకం కింద చిత్తూరు జిల్లాలో ఆగస్టు నెల పింఛన్ల పంపిణీ శనివారం ఉదయం ప్రారంభమైంది. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ స్వయంగా చిత్తూరు నగరంలోని మసీదు మిట్ట గ్రామ సచివాలయ పరిధిలోని ఓటి చెరువు, 17వ వార్డులో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు పంపిణీ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా లబ్ధిదారులతో మమేకమై వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకోవడంతో పాటు ప్రతి నెలా సకాలంలో పింఛన్లు అందుతున్నాయా, ఎవరైనా డబ్బులు డిమాండ్ చేశారా అని ఆరా తీశారు. పింఛన్ల పంపిణీ పారదర్శకంగా, సజావుగా జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఈ సందర్భంగా అబ్దుల్ లతీఫ్, ఎల్.సి. మణి, హుస్సేన్ బేగం తదితర లబ్ధిదారులకు ఒక్కొక్కరికి రూ.4 వేల చొప్పున వృద్ధాప్య పింఛన్లను కలెక్టర్ అందజేశారు. ఇంటి వద్దకే ప్రభుత్వం పింఛన్లు అందించడం వల్ల వృద్ధులు, వికలాంగులు, అనారోగ్యంతో బాధపడుతున్న వారు ఎలాంటి ఇబ్బందులు పడకుండా లబ్ధి పొందుతున్నారని ఆయన పేర్కొన్నారు.
అనంతరం జిల్లా కలెక్టర్ విడుదల చేసిన ప్రకటనలో ఆగస్టు నెలకు సంబంధించి చిత్తూరు జిల్లాలో మొత్తం 2,31,815 మంది లబ్ధిదారులకు రూ.100.35 కోట్ల పింఛన్ మొత్తాన్ని పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఇందులో సాధారణ పింఛన్లు 2,29,730 మందికి రూ.97.65 కోట్లు, ఆరోగ్య పింఛన్లు 2,085 మందికి రూ.2.70 కోట్లు పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు.

ఉదయం 7 గంటల నుంచే సచివాలయ సిబ్బంది ఇంటి వద్దకే వెళ్లి పింఛన్లు అందించేలా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. తొలి రోజే 100 శాతం పంపిణీ పూర్తయ్యేలా చర్యలు తీసుకున్నామని, అనివార్య కారణాల వల్ల ఆగస్టు 1న పింఛన్ పొందలేని వారికి ఆగస్టు 2న పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. పింఛన్‌దారులు తమ నివాసాల్లో అందుబాటులో ఉండేలా ముందస్తు సమాచారం ఇచ్చి పంపిణీ ప్రక్రియకు సహకరించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నరసింహ ప్రసాద్, సహాయ కమిషనర్ ప్రసాద్, సచివాలయ వెల్ఫేర్ సెక్రటరీ కె. పళణి, అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీ వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
