వ్యాధుల నియంత్రణకు శాఖల సమన్వయం కీలకం
అదనపు కలెక్టర్ అరుణశ్రీ
వాహక జనిత వ్యాధులు, హెపటైటిస్, క్షయ నివారణకు సమిష్టి కార్యాచరణపై దృష్టి
పెద్దపల్లి రూరల్, ఆంధ్రప్రభ: వాహక జనిత వ్యాధులు, వైరల్ హెపటైటిస్, క్షయ నియంత్రణలో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తే మెరుగైన ఫలితాలు సాధించవచ్చని పెద్దపల్లి జిల్లా అదనపు కలెక్టర్ జల్ద అరుణశ్రీ పేర్కొన్నారు.
శుక్రవారం ఐడీఓసీ సమావేశ మందిరంలో జాతీయ వాహక జనిత వ్యాధుల నియంత్రణ, జాతీయ వైరల్ హెపటైటిస్ నియంత్రణ, జాతీయ క్షయ నియంత్రణ కార్యక్రమాలపై నిర్వహించిన సమన్వయ సమావేశానికి ఆమె అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల్లో వ్యాధులపై విస్తృత అవగాహన కల్పించడం ద్వారా వాటి వ్యాప్తిని అరికట్టవచ్చని అన్నారు. ఇందుకు వైద్య ఆరోగ్యశాఖతో పాటు సంబంధిత అన్ని శాఖలు సమిష్టిగా కృషి చేయాలని సూచించారు.
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వై. పవిత్ర మాట్లాడుతూ అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. త్వరలో ప్రభుత్వ శాఖల ఉద్యోగులకు హెపటైటిస్-బి టీకాలు అందించేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలిపారు.
డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ శ్రీరాములు మాట్లాడుతూ మలేరియా, డెంగ్యూ, ఫైలేరియా, చికున్‌గున్యా, హెపటైటిస్-బి వంటి వ్యాధుల నివారణకు ప్రజల్లో అవగాహన పెంచాల్సిన అవసరాన్ని వివరించారు.
క్షయ, ఎయిడ్స్ నియంత్రణ కార్యక్రమ అధికారి డాక్టర్ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ క్షయ లక్షణాలు ఉన్నవారికి వెంటనే పరీక్షలు నిర్వహించి చికిత్స అందించాలని అన్నారు. క్షయరహిత గ్రామాల లక్ష్య సాధనకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కోరారు.
ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
