డిజైన్ థింకింగ్‌తోనే ఉన్నత విద్యకు నూతన దిశ

  • విశ్వవిద్యాలయాలు–పరిశ్రమల భాగస్వామ్యమే విద్యార్థుల భవిష్యత్‌కు బాట
  • నైపుణ్యాధారిత, ఉపాధి లక్ష్య పాఠ్య ప్రణాళికలు రూపొందించాలి
  • కృష్ణా విశ్వవిద్యాలయ వీసీ ప్రొఫెసర్ కూన రామ్‌జీ

విజయవాడ, ఆంధ్రప్రభ: మారుతున్న ప్రపంచ అవసరాలకు అనుగుణంగా ఉన్నత విద్యా వ్యవస్థలో సమూల మార్పులు అవసరమని, సంప్రదాయ బోధనకు బదులుగా డిజైన్ థింకింగ్, పరిశ్రమల భాగస్వామ్యం, నైపుణ్యాధారిత బోధనకు ప్రాధాన్యం ఇవ్వాలని కృష్ణా విశ్వవిద్యాలయం వైస్‌ చాన్సలర్ ప్రొఫెసర్ కూన రామ్‌జీ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యామండలి (ఏపీఎస్‌సీహెచ్‌ఈ) నిర్వహించిన “డిజైన్ థింకింగ్ ఇన్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఫర్ వైస్ ఛాన్సలర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్” వర్క్‌షాప్ అనంతరం ఆయన స్పందించారు.

విశ్వవిద్యాలయాలు పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా సరళమైన, అంతరశాఖల సమన్వయంతో కూడిన, భవిష్యత్ ఉపాధి అవకాశాలను దృష్టిలో పెట్టుకున్న పాఠ్య ప్రణాళికలను రూపొందించాలని సూచించారు. ఎంపథైజ్–డిఫైన్–ఐడియేట్–ప్రోటోటైప్–టెస్ట్ విధానం ద్వారా సమస్యల విశ్లేషణ, వినూత్న పరిష్కారాల రూపకల్పనపై సమగ్ర అవగాహన లభించిందన్నారు. బ్రెయిన్‌స్టార్మింగ్‌, మైండ్ మ్యాపింగ్‌, జట్టు చర్చలు, స్టేక్‌హోల్డర్ విశ్లేషణ వంటి అంశాలు విద్యా పరిపాలనకు కొత్త దృక్పథాన్ని అందించాయని చెప్పారు. విద్యార్థులు, అధ్యాపకులు, పరిశ్రమలు, సమాజం అవసరాలను సమన్వయం చేసే విద్యా విధానాలే భవిష్యత్‌కు మార్గదర్శకమవుతాయని పేర్కొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో నాణ్యమైన విద్యా సంస్కరణలకు ఇటువంటి అకాడమిక్ వర్క్‌షాప్‌లు నిరంతరం నిర్వహించాలని సూచించిన ప్రొఫెసర్ కూన రామ్‌జీ, ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ఏపీఎస్‌సీహెచ్‌ఈతో పాటు శిక్షణ అందించిన డాక్టర్ కంచర్ల మోహన్‌ను అభినందించారు. విశ్వవిద్యాలయాలు కాలానికి అనుగుణంగా మారితేనే విద్యార్థుల భవిష్యత్తు మారుతుందని, డిజైన్ థింకింగ్ ఆధారిత నిర్ణయాలే భారత ఉన్నత విద్యను ప్రపంచ స్థాయికి తీసుకెళ్తాయని ఆయన పేర్కొన్నారు.