మానవ అక్రమ రవాణాపై సమాజమంతా అప్రమత్తం కావాలి

  • జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ
  • 22 మంది విముక్త కార్మికులకు రూ.6.60 లక్షల
  • పునరావాస నిధుల విడుదల

విజయవాడ, ఆంధ్రప్రభ : మహిళలు, చిన్నారుల అక్రమ రవాణాను అరికట్టాలంటే సమాజంలోని ప్రతి ఒక్కరిలో అవగాహనతో పాటు అప్రమత్తత పెరగాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ పిలుపునిచ్చారు. ప్రపంచ మానవ అక్రమ రవాణా నిరోధక దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం విజయవాడ కలెక్టరేట్ పీజీఆర్‌ఎస్ సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మానవ అక్రమ రవాణా నిరోధక గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మహిళలు, చిన్నారుల అక్రమ రవాణాపై ప్రజల్లో చైతన్యం పెంపొందించడమే ఈ దినోత్సవం ప్రధాన ఉద్దేశ్యమన్నారు. విద్యార్థులు, యువతలో అవగాహన పెరిగితే కుటుంబాలతో పాటు సమాజాన్ని కూడా రక్షించే స్థాయికి చేరుకుంటారని పేర్కొన్నారు.

ఉద్యోగాలు, విద్య, విదేశీ అవకాశాల పేరుతో మోసగాళ్లు యువతను లక్ష్యంగా చేసుకుంటున్నారని, ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా జరిగే మోసాల పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సాంకేతిక పరిజ్ఞానం విస్తరించినప్పటికీ మానవ అక్రమ రవాణా, లైంగిక దోపిడీ, వెట్టిచాకిరి, బాలల అక్రమ రవాణా, బలవంతపు భిక్షాటన, బలవంతపు వివాహాలు, అవయవాల అక్రమ విక్రయాలు వంటి నేరాలు కొనసాగుతుండటం ఆందోళనకరమని అన్నారు. మహిళలు, చిన్నారులు, అనాథలు, చదువు మానేసిన పిల్లలు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలే ఎక్కువగా ఈ నేరాలకు బలవుతున్నారని పేర్కొన్నారు.

గ్రామ, వార్డు స్థాయిలో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఈ నేరాలను సమర్థవంతంగా అరికట్టవచ్చన్నారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా సంఘటనలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. బాలల అత్యవసర పరిస్థితుల్లో 1098 చైల్డ్ హెల్ప్‌లైన్‌ను వినియోగించాలని తెలిపారు. భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్), పోక్సో తదితర చట్టాల ప్రకారం నేరస్థులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. జిల్లా కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ గుంటుపల్లి ధనలక్ష్మి మాట్లాడుతూ మానవ అక్రమ రవాణా ఒక వ్యవస్థీకృత నేరమని, ఉద్యోగాలు లేదా విద్య పేరుతో అపరిచితులను నమ్మి మోసపోవద్దని యువతకు సూచించారు.

వెట్టిచాకిరి నిర్మూలనకు నిరంతర నిఘా కొనసాగుతోందని, మహిళలు భద్రత కోసం “శక్తి” వంటి భద్రతా యాప్‌లను వినియోగించుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా 2025 మే 7న నున్న ప్రాంతంలోని ఇటుక బట్టీ నుంచి వెట్టిచాకిరి నుంచి విముక్తి పొందిన ఒడిశాకు చెందిన 22 మంది కార్మికులకు ప్రాథమిక పునరావాస నిధుల కింద ఒక్కొక్కరికి రూ.30 వేల చొప్పున మొత్తం రూ.6.60 లక్షలను విడుదల చేశారు. బాధితులు తిరిగి సాధారణ జీవితం గడిపేందుకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని కలెక్టర్ భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో సోషల్ వర్కర్ తిరుపతిరావు, ఎన్జీవో ప్రతినిధి రామకృష్ణ, వివిధ శాఖల అధికారులు, సోషల్ వర్కర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.