వైభవంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం..
వైభవంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం..
వైశాఖ శుద్ధ షష్టి సందర్భంగా ప్రత్యేక పూజలు..
వేదఘోషల మధ్య శాస్త్రోక్త నిర్వహణ
పూజలో పాల్గొన్న చైర్మన్ బొర్రా గాంధీ
కుజదోష నివారణ, వివాహ యోగానికి భక్తుల విశ్వాసం
ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : వైశాఖ శుద్ధ షష్టి పర్వదినాన్ని పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. వేదమంత్రాల మధ్య శాస్త్రోక్తంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కల్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. సంప్రదాయ ప్రకారం ప్రతి నెల ‘శుద్ధ షష్టి’ తిథి రోజున నిర్వహించే ఈ కళ్యాణోత్సవం… ఈసారి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

కొండపై మహామండపం 7వ అంతస్తులోని కళావేదిక వద్ద అర్చక స్వాములు సంప్రదాయ పద్ధతిలో పూజా కార్యక్రమాలను నిర్వహించి స్వామివారి కళ్యాణాన్ని ఘనంగా జరిపించారు. ఈ వేడుకలో దేవస్థానం చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ) పాల్గొని స్వామివార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ వాతావరణం వేదఘోషలతో మార్మోగగా… భక్తులు భక్తిశ్రద్ధలతో కార్యక్రమంలో పాల్గొన్నారు.

అర్చకులు తెలిపిన వివరాల ప్రకారం… శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి కళ్యాణాన్ని దర్శించడం లేదా పూజలో పాల్గొనడం ద్వారా కుజదోష నివారణ, వివాహానికి ఆటంకాలు తొలగడం, సంతాన ప్రాప్తి, శత్రువులపై విజయాలు సాధ్యమవుతాయని విశ్వాసం ఉంది. ఈ నమ్మకంతో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి అనుగ్రహం పొందారు.
