Nara Lokesh | ప్రపంచ పెట్టుబడిదారుల తొలి ఎంపికగా ఏపీ…
800 మెగావాట్ల క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టులకు శంకుస్థాపన
ఏపీపై పెట్టుబడిదారుల విశ్వాసం పెరిగింది
హరిత ఇంధన రంగంలో భారీ పెట్టుబడులు
పత్తికొండలో భారీ విద్యుత్ ప్రాజెక్టుకు శ్రీకారం
పెట్టుబడుల గమ్యస్థానంగా ఏపీ: లోకేశ్
Nara Lokesh | కర్నూలు రూరల్ బ్యూరో, జులై 30, ఆంధ్రప్రభ : ఏపీని దేశంలోనే కాకుండా ప్రపంచ పెట్టుబడిదారుల తొలి గమ్యస్థానంగా నిలబెట్టే దిశగా కూటమి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోందని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేశ్ అన్నారు. పత్తికొండ మండలం హోసూరు సమీపంలో టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్ (TPREL), సుజ్లాన్ సంస్థల ఆధ్వర్యంలో ఏర్పాటు కానున్న 800 మెగావాట్ల హైబ్రిడ్ క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టులకు గురువారం రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేశ్ శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం ప్రపంచ పెట్టుబడిదారుల విశ్వాసాన్ని తిరిగి సంపాదించుకుని గ్లోబల్ ఇన్వెస్టర్ల తొలి ఎంపికగా మారిందన్నారు.
రూ.5,350 కోట్లతో మెగా ప్రాజెక్టు..
టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా పత్తికొండలో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టు, అనంతపురం జిల్లా కనేకల్లులో 400 మెగావాట్ల విండ్ పవర్ ప్రాజెక్టు ఏర్పాటు కానున్నట్లు తెలిపారు. మొత్తం రూ.5,350 కోట్ల పెట్టుబడితో అమలు కానున్న ఈ ప్రాజెక్టు నిర్మాణ దశలో సుమారు 4 వేల మందికి ఉపాధి లభిస్తుందని పేర్కొన్నారు. 3,400 ఎకరాలకు పైగా విస్తరించే ఈ ప్రాజెక్టు ద్వారా 1,100కుపైగా రైతు కుటుంబాలకు దాదాపు మూడు దశాబ్దాల పాటు స్థిరమైన కౌలు ఆదాయం లభిస్తుందని వివరించారు.

ఏపీపై మళ్లీ పెట్టుబడిదారుల విశ్వాసం..
2024లో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చే సమయానికి రాష్ట్రంలో పునరుత్పాదక ఇంధన రంగం తీవ్ర సంక్షోభంలో ఉందన్నారు. గత ఐదేళ్లలో ఒక్క ప్రధాన రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్టు కూడా ప్రారంభం కాలేదని, విద్యుత్ కొనుగోలు ఒప్పందాల రద్దుతో అంతర్జాతీయ పెట్టుబడిదారుల్లో విశ్వాసం దెబ్బతిందన్నారు. ప్రపంచంలోని ప్రముఖ ఇన్ఫ్రాస్ట్రక్చర్, క్లైమేట్ ఫండ్స్ రాష్ట్రాన్ని బ్లాక్‌లిస్ట్‌లో పెట్టాయని, ఏడాది కాలంలో విశ్వసనీయ పరిపాలనతో ఆ పరిస్థితిని పూర్తిగా మార్చగలిగామని తెలిపారు.
400 శాతం పెరిగిన క్లీన్ ఎనర్జీ సామర్థ్యం..
గత ఏడాదితో పోలిస్తే ఈ ఒక్క ఏడాదిలోనే రాష్ట్ర పునరుత్పాదక ఇంధన సామర్థ్యం 400 శాతం పెరిగిందని మంత్రి వెల్లడించారు. ఇది ప్రభుత్వం కల్పించిన విశ్వాసానికి నిదర్శనమన్నారు.
160 గిగావాట్ల లక్ష్యం..
ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ–2024 ద్వారా రాష్ట్రంలో 160 గిగావాట్ల క్లీన్ ఎనర్జీ సామర్థ్యం సాధించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. సోలార్ మాడ్యూల్స్, సెల్స్, బ్యాటరీలు, గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా, ట్రాన్స్మిషన్ నెట్వర్క్, స్టోరేజ్ వ్యవస్థలు, పోర్టులు, తయారీ పరిశ్రమల వరకు మొత్తం క్లీన్ ఎనర్జీ సరఫరా గొలుసును ఆంధ్రప్రదేశ్‌లోనే అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు.

ప్రపంచ దిగ్గజాల చూపు ఏపీపై..
ప్రస్తుతం బ్రూక్‌ఫీల్డ్, బ్లాక్‌స్టోన్, బ్లాక్‌రాక్, EQT, TPG వంటి ప్రపంచ ప్రైవేట్ ఈక్విటీ సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్నాయని చెప్పారు. అలాగే టాటా పవర్, సుజ్లాన్, రెన్యూ, ప్రీమియర్ ఎనర్జీస్, ACME, వారీ వంటి దేశీయ దిగ్గజ సంస్థలు కూడా తమ కార్యకలాపాలను విస్తరిస్తున్నాయని వెల్లడించారు.
టాటా గ్రూప్‌తో బలమైన అనుబంధం..
టాటా గ్రూప్‌తో దశాబ్దాల అనుబంధం ఉందని గుర్తు చేసిన మంత్రి, హైటెక్ సిటీ నిర్మాణ సమయంలో చంద్రబాబు నాయుడు దూరదృష్టిని నమ్మిన తొలి సంస్థల్లో టీసీఎస్ ఒకటని తెలిపారు. 2024లో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టాటా సన్స్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్‌ను కలిసి పెట్టుబడులపై చర్చించిన విషయాన్ని గుర్తు చేశారు. పెట్టుబడిదారులకు రాయితీల కంటే వేగవంతమైన అనుమతులే ముఖ్యమని ఆయన సూచించారని, అందుకే ప్రభుత్వం “సింపుల్–స్పీడ్–స్టెబిలిటీ” విధానంతో ముందుకెళ్తోందన్నారు.
విదేశాలకు క్లీన్ ఎనర్జీ ఎగుమతులు..
భారతదేశంలోనే అత్యంత పొడవైన తీరప్రాంతం, ప్రపంచ స్థాయి ఓడరేవులు, సమృద్ధిగా లభించే పునరుత్పాదక వనరులతో ఆంధ్రప్రదేశ్ గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా ఎగుమతులకు దేశానికి ముఖద్వారంగా మారే అవకాశముందని చెప్పారు. త్వరలో రాష్ట్రంలో ఉత్పత్తయ్యే స్వచ్ఛ ఇంధనం యూరప్, జపాన్, కొరియా తదితర దేశాలకు ఎగుమతి అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌కు ఆహ్వానం..
ఐఐటీ తిరుపతి, యూనివర్సిటీ ఆఫ్ న్యూ సౌత్ వేల్స్ భాగస్వామ్యంతో ఏర్పాటు చేస్తున్న సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో టాటా పవర్ భాగస్వామ్యం కావాలని మంత్రి ఆహ్వానించారు. సోలార్ తయారీ, పునరుత్పాదక ఇంధన సాంకేతికతలపై పరిశోధనలు, నైపుణ్యాభివృద్ధికి ఇది కేంద్రంగా మారుతుందని తెలిపారు.
సుజ్లాన్‌కు ప్రత్యేక అభినందనలు..
భారత పవన విద్యుత్ రంగంలో అగ్రగామిగా ఉన్న సుజ్లాన్ సంస్థ ఈ ప్రాజెక్టులో భాగస్వామ్యం కావడం రాష్ట్రానికి గర్వకారణమన్నారు. అనంతపురంలోనే విండ్ టర్బైన్ల తయారీ జరగడం వల్ల స్థానిక పారిశ్రామికాభివృద్ధికి మరింత ఊతం లభిస్తుందని చెప్పారు. యువతకు నైపుణ్య శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నందుకు సంస్థకు అభినందనలు తెలిపారు.
కర్నూలుపై ప్రత్యేక దృష్టి..
ఉమ్మడి కర్నూలు జిల్లాతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని మంత్రి చెప్పారు. యువగళం పాదయాత్రలో 45 రోజుల పాటు 14 నియోజకవర్గాల్లో పర్యటించిన అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు. ప్రజల సమస్యలు, వలసలు తనకు తెలుసని పేర్కొన్నారు. కర్నూలు జిల్లాకు భారీ పరిశ్రమలు తీసుకురావడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్‌తో కలిసి ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులను ఆకర్షిస్తున్నామని తెలిపారు.
యువతకు పిలుపు..
పరిశ్రమలు తీసుకురావడం ప్రభుత్వ బాధ్యత… వాటికి తగిన నైపుణ్యంతో సిద్ధమవడం యువత బాధ్యత అని మంత్రి అన్నారు. ప్రస్తుతం ఐటీఐలను పరిశ్రమలకు అనుసంధానం చేస్తున్నామని, ప్రతి ఐటీఐని ఒక పరిశ్రమకు అనుసంధానించి అవసరమైన నైపుణ్యాల ప్రకారం శిక్షణ ఇస్తున్నామని తెలిపారు.
ఇటీవల ప్రారంభించిన “లెర్న్ – ఎర్న్ – గ్రాడ్యుయేట్” విధానంలో నడిచే విశ్వవిద్యాలయం ద్వారా మూడు నెలలు తరగతి గదిలో, ఎనిమిది నెలలు పరిశ్రమల్లో శిక్షణ పొంది చదువుకుంటూనే సంపాదించే అవకాశం కల్పిస్తున్నామని వివరించారు.
దేశానికి దిశానిర్దేశం చేసే ఏపీ
ప్రభుత్వం, పరిశ్రమలు, రైతులు, ప్రజలు కలిసి స్వచ్ఛ ఇంధన రంగంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను దేశానికి దిశానిర్దేశం చేసే రాష్ట్రంగా, ప్రపంచ క్లీన్ ఎనర్జీ రంగంలో నాయకత్వం వహించే కేంద్రంగా తీర్చిదిద్దేందుకు అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో టాటా పవర్ సీఈఓ ,ఎండీ ప్రవీర్ సిన్హా, టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ సీఈఓ, ఎండీ సంజయ్ బంగా, సుజ్లాన్ వైస్ చైర్మన్ గిరీష్ తంతి, రాష్ట్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్, ఎమ్మెల్యేలు కాలవ శ్రీనివాసులు, కేఈ శ్యాంబాబు, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి, టాటా పవర్, సుజ్లాన్ సంస్థల ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
