సీజనల్ వ్యాధుల నివారణపై అప్రమత్తంగా ఉండాలి..

  • ఆరోగ్య కేంద్రాల పనితీరు, సేవలపై జిల్లా వైద్యాధికారి డా. శ్రావణ్‌బాబు సమీక్ష…

(విజయవాడ, ఆంధ్రప్రభ) : సీజనల్ వ్యాధుల నివారణకు క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా పనిచేయాలని ఎన్టీఆర్ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డా. ఎ. శ్రావణ్‌బాబు వైద్య సిబ్బందిని ఆదేశించారు. గురువారం లబ్బీపేట, గిరిపురం పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో పాటు జిల్లా మలేరియా కార్యాలయాన్ని సందర్శించి ఆరోగ్య సేవలు, వివిధ కార్యక్రమాల అమలు తీరును సమీక్షించారు.

పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సిబ్బంది హాజరు, పనితీరు, ప్రభుత్వ ఆరోగ్య కార్యక్రమాల లక్ష్యసాధన, పురోగతి, ఆస్పత్రి విభాగాల పనితీరును పరిశీలించి అవసరమైన సూచనలు చేశారు. లబ్బీపేట ఆరోగ్య కేంద్రంలో చికిత్స కోసం వచ్చిన ప్రజలతో మాట్లాడి ఆస్పత్రిలో అందుతున్న సేవలపై క్యూ ఆర్ కోడ్ ద్వారా ఫీడ్‌బ్యాక్ నమోదు చేసే విధానాన్ని వివరించారు. ఆస్పత్రికి వచ్చే ప్రతి ఒక్కరి నుంచి తప్పనిసరిగా ఫీడ్‌బ్యాక్ నమోదు చేయించాలని సిబ్బందికి సూచించారు.

గిరిపురం పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారులు, సిబ్బందితో సమావేశమై డయేరియా లేదా ఇతర అత్యవసర పరిస్థితులు తలెత్తిన వెంటనే పై అధికారులకు సమాచారం అందించి వారి ఆదేశాల మేరకు తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రతి రోజూ క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజల ఆరోగ్య పరిస్థితులను పరిశీలించాలని, ప్రస్తుత వర్షాకాలంలో కోవిడ్ లక్షణాలు, డయేరియా, మలేరియా, డెంగీ వంటి సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించి ముందస్తు నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు.

అనంతరం జిల్లా మలేరియా కార్యాలయాన్ని సందర్శించిన డా. శ్రావణ్‌బాబు, సీజనల్ వ్యాధుల నియంత్రణకు అవసరమైన అన్ని చర్యలను సమర్థవంతంగా అమలు చేయాలని సిబ్బందికి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో లబ్బీపేట వైద్యాధికారి డా. భార్గవి, గిరిపురం వైద్యాధికారి డా. కరుణాసేన్‌తో పాటు వైద్య, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.