Amaravati Bullet Train | అమరావతిలోనే తొలి స్టేషన్
Amaravati Bullet Train | అమరావతిలోనే తొలి స్టేషన్
Amaravati Bullet Train | తెలంగాణకు ప్రయోజనం
చెన్నైతో ఆర్థిక అనుసంధానం
దక్షిణ భారత రవాణాలో గేమ్‌చేంజర్
Amaravati Bullet Train | హైదరాబాద్, ఆంధ్రప్రభ ప్రత్యేక ప్రతినిధి: దక్షిణ భారతదేశ రవాణా రంగంలో మరో కీలక అధ్యాయం మొదలవబోతోంది. హైదరాబాద్, అమరావతి, చెన్నై హైస్పీడ్ రైలు (బుల్లెట్ రైలు) కారిడార్ రూపుదిద్దుకుంటోంది. కేంద్ర ప్రభుత్వం ప్రాథమికంగా గుర్తించిన ఈ కారిడార్‌కు సంబంధించి డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్) తయారీ ప్రక్రియ వేగవంతమైంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా చేసిన సూచనలతో ఈ కారిడార్ అమరావతి ప్రాంతం మీదుగానే వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.
దాదాపు 760 కిలోమీటర్ల పొడవు కలిగిన ఈ హైస్పీడ్ రైలు మార్గం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలను అనుసంధానించనుంది. తొలుత ఈ కారిడార్‌ను గుంటూరు జిల్లా రావెల సమీపంలో ప్రతిపాదిత అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరువగా తీసుకెళ్లాలని కేంద్రం నిర్ణయించింది.
అయితే తాజా సమీక్షల్లో ఈ మార్గం అమరావతి రాజధాని ప్రాంతానికి, విజయవాడ నగరానికి కొంత దూరంగా వెళ్లే అవకాశం ఉందని అధికారులు గుర్తించారు. రాజధాని నగర అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలన్న ఉద్దేశంతో కారిడార్‌ను నేరుగా అమరావతి మీదుగానే తీసుకెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది.
అమరావతిలోనే తొలి స్టేషన్
డీపీఆర్ తుది రూపం దాల్చిన తర్వాత స్టేషన్లు ఖరారవుతాయి. ప్రస్తుత చర్చల ప్రకారం రాజధాని అమరావతి ప్రాంతంలోనే ఒక ప్రధాన హైస్పీడ్ రైలు స్టేషన్ ఏర్పాటయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. దీనివల్ల అమరావతికి జాతీయ స్థాయి కనెక్టివిటీ పెరగనుంది. రాజధానిలో పెట్టుబడులకు గేమ్‌చేంజర్ అవుతుందని భావిస్తున్నారు.
ఐటీ, ఫైనాన్షియల్, సర్వీస్ రంగాల విస్తరణతో పాటు స్థిరాస్తి (రియల్ ఎస్టేట్) వ్యాపారం ఊపందుకుని భూముల విలువలు భారీగా పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
• పాత ప్రతిపాదనకే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొగ్గు
• హైదరాబాద్ – చెన్నై కారిడార్‌కు డీపీఆర్
• హైస్పీడ్ రైల్ కారిడార్‌తో దక్షిణ భారత రవాణాలో గేమ్‌చేంజర్
• బుల్లెట్ రైలు ప్రాజెక్టుతో తెలంగాణకు ప్రయోజనం
• దక్షిణాది రాష్ట్రాల మార్కెట్లతో ఐటీ పరిశ్రమ అనుసంధానం
• ఫార్మా, బయోటెక్ రంగాలకు లాజిస్టిక్ సౌలభ్యం
తెలంగాణకు ప్రయోజనం
హైదరాబాద్, అమరావతి, చెన్నై బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు వల్ల తెలంగాణకు భారీగా ప్రయోజనం కలగనుంది. ప్రస్తుతం హైదరాబాద్, చెన్నై మధ్య రైలు ప్రయాణానికి 10-13 గంటల సమయం పడుతోంది. హైస్పీడ్ రైలు అందుబాటులోకి వస్తే ఈ సమయం 4-5 గంటలకు పరిమితమయ్యే అవకాశం ఉంది. దీంతో హైదరాబాద్ ఐటీ పరిశ్రమకు దక్షిణ భారత మార్కెట్లతో వేగవంతమైన అనుసంధానం కల్పించే అవకాశం ఉంది.
ఫార్మా, బయోటెక్ రంగాలకు లాజిస్టికల్ సౌలభ్యం కలుగుతుందని, వ్యాపార ప్రయాణాల పెరుగుదలకు మంచి అవకాశం ఉంటుందని చెబుతున్నారు. నల్గొండ, సూర్యాపేట తదితర ప్రాంతాలకు సమీపంలో స్టేషన్లు ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయి.
చెన్నైతో ఆర్థిక అనుసంధానం
దేశంలోనే అతిపెద్ద పారిశ్రామిక, ఆటోమొబైల్, పోర్టు నగరాల్లో చెన్నై ఒకటి. హైదరాబాద్, అమరావతి, చెన్నై హైస్పీడ్ కారిడార్ ద్వారా మూడు ప్రధాన ఆర్థిక కేంద్రాలు ఒకే రవాణా వ్యవస్థలో అనుసంధానం కానున్నాయి. ఇది దక్షిణ భారతదేశంలో పరిశ్రమల విస్తరణకు అవకాశం ఉంటుందని, ఎగుమతుల పెరుగుదలకు దోహదపడుతుందని భావిస్తున్నారు. పర్యాటక రంగం అభివృద్ధి జరుగుతుందని, నగరాల మధ్య ఆర్థిక సహకారం వంటి అంశాలకు ఊతమివ్వనుందని చెబుతున్నారు.
