భారీ వర్షాల్లోనూ ప్రజాసేవలో కోరుట్ల సీఐ లక్ష్మీనారాయణ

స్వయంగా రంగంలోకి దిగి చెట్టును తొలగించిన సీఐ

కోరుట్ల, ఆంధ్రప్రభ: గత రెండు మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పలుచోట్ల చెట్లు నేలకూలి రహదారులపై పడటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో కోరుట్ల సర్కిల్ ఇన్‌స్పెక్టర్ లక్ష్మీనారాయణ స్వయంగా రంగంలోకి దిగి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టారు.

జాతీయ రహదారిపై కూలిన భారీ వృక్షాన్ని తన సిబ్బందితో కలిసి తొలగించి వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు. ఉన్నత హోదాలో ఉన్నప్పటికీ ఎలాంటి భేదాభిప్రాయం లేకుండా సామాన్య వ్యక్తిలా ప్రజల మధ్య ఉండి సమస్య పరిష్కారానికి కృషి చేయడం పట్ల ప్రజలు అభినందనలు తెలిపారు.

భారీ వర్షాలు, ప్రతికూల పరిస్థితుల్లోనూ ప్రజల భద్రత కోసం అప్రమత్తంగా విధులు నిర్వహిస్తూ సీఐ లక్ష్మీనారాయణ సేవలందిస్తున్నారని పలువురు పేర్కొన్నారు.

కోరుట్ల సర్కిల్ పరిధిలో ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న సీఐ సేవలు ఆదర్శంగా నిలుస్తున్నాయని పట్టణ ప్రజలు తెలిపారు.