రైతులు బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి
- మైలవరం మండల వ్యవసాయ అధికారి కె. సంధ్యారాణి
మైలవరం, ఆంధ్రప్రభ : ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్బీవై) పథకం కింద ఎన్టీఆర్ జిల్లాలో వాతావరణ ఆధారిత పంటల బీమా పత్తి పంటకు, దిగుబడి ఆధారిత పంటల బీమా వరి, పెసర, ఎర్ర మిరప, మొక్కజొన్న పంటలకు అమలు చేస్తున్నట్లు మైలవరం మండల వ్యవసాయ అధికారి కె. సంధ్యారాణి తెలిపారు. పత్తి, పెసర, ఎర్ర మిరప, మొక్కజొన్న పంటలకు బీమా ప్రీమియం చెల్లించేందుకు ఈ నెల 31వ తేదీ (శుక్రవారం)తో గడువు ముగుస్తుందని ఆమె పేర్కొన్నారు. బ్యాంకుల ద్వారా పంట రుణం తీసుకోని రైతులు తప్పనిసరిగా సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ (సీఎస్సీ) లేదా మీ సేవా కేంద్రాలను సంప్రదించి ప్రీమియం చెల్లించి పంటల బీమా పోర్టల్లో నమోదు చేసుకోవాలని సూచించారు.
వరి పంటకు బీమా ప్రీమియం చెల్లించేందుకు ఆగస్టు 15 వరకు గడువు ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుతం నెలకొన్న వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పంట సాగు చేసిన ప్రతి రైతు పంటల బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. ఎకరానికి నిర్ణయించిన ప్రీమియం వివరాలు ఇలా ఉన్నాయి. పత్తి పంటకు రూ.1,923, వరి పంటకు రూ.850, ఎర్ర మిరపకు రూ.1,800, పెసర పంటకు రూ.360, మొక్కజొన్నకు రూ.370గా నిర్ణయించినట్లు తెలిపారు. పంటల బీమా పథకానికి సంబంధించిన వివరాలు లేదా సందేహాలు ఉంటే సంబంధిత రైతు సేవా కేంద్రాల్లోని గ్రామ వ్యవసాయ సహాయకులు లేదా ఉద్యానవన సహాయకులను సంప్రదించాలని మండల వ్యవసాయ అధికారి కె. సంధ్యారాణి రైతులకు సూచించారు.
