నేల ఆరోగ్యంపై విద్యార్థులకు అవగాహన..
ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ : ఉరవకొండలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాలలో గురువారం విద్యార్థినులకు భూసార పరీక్షలు, వాటి ప్రాముఖ్యత, మట్టి నమూనాల సేకరణ విధానంపై అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఉరవకొండ వ్యవసాయ డివిజన్ సహాయ సంచాలకులు సత్యనారాయణ మాట్లాడుతూ, భూసార పరీక్షల ద్వారా మట్టి భౌతిక, రసాయనిక లక్షణాలను విశ్లేషించి నేలలోని పోషక పదార్థాల స్థాయిని తెలుసుకోవచ్చని తెలిపారు. దాని ఆధారంగా పంటలకు అవసరమైన ఎరువుల మోతాదును నిర్ణయించి ఖర్చును తగ్గించడంతో పాటు అధిక దిగుబడులు సాధించవచ్చన్నారు.
భూసార పరీక్షల ద్వారా నేలలో ఏ పంటలు సాగు చేయవచ్చో, ఎరువులను ఎంత మోతాదులో, ఎప్పుడు వేయాలో తెలుసుకోవచ్చని వివరించారు. అలాగే నేల సమస్యలైన కారు చౌడు, పాలు చౌడును గుర్తించి తగిన చర్యలు తీసుకోవచ్చని చెప్పారు.
మట్టి నమూనాల సేకరణలో పైరు పంటలకు సుమారు ఆరు అంగుళాల లోతు, పండ్ల తోటల్లో ఐదు నుంచి ఆరు అడుగుల వరకు ప్రతి అడుగుకు ఒక నమూనా, ఆమ్ల నేలల్లో ప్రతి ఆరు అంగుళాలకు ఒక నమూనా సేకరించాలని సూచించారు.
వ్యవసాయ శాఖ, విద్యాశాఖల సమన్వయంతో రాష్ట్రీయ కృషి వికాస్ యోజన (ఆర్‌కేవీవై) పథకం కింద ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. పాఠశాల విద్యార్థుల సహకారంతో 50 భూసార నమూనాలను సేకరించి విశ్లేషించి భూసార పరీక్ష కార్డులను రైతులకు అందజేయనున్నట్లు తెలిపారు. నేల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ, ఆరోగ్యకరమైన ఆహార ఉత్పత్తుల ప్రాధాన్యతపై విద్యార్థుల్లో అవగాహన పెంపొందించడమే కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు.
భూసార పరీక్ష కేంద్రం వ్యవసాయ అధికారులు శ్రీనాథ్ రెడ్డి, బి.ఆర్. శేఖర్ రెడ్డి పాఠశాల ఆవరణలో మట్టి నమూనాల సేకరణను ప్రాయోగికంగా ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ ఆర్.కె.ఎల్. జ్ఞాన ప్రసూన, ఉపాధ్యాయులు, ఆత్మ సిబ్బంది కిన్నెర తదితరులు పాల్గొన్నారు.
