ఎడతెరిపి లేని వర్షాలు.. నిండు కుండలా ప్రాణహిత

చెన్నూర్, ఆంధ్రప్రభ: గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో చెన్నూర్ నియోజకవర్గంలోని వాగులు, కాలువలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాల కారణంగా కోటపల్లి మండలంలోని అర్జునగుట్ట, వెంచపల్లి ప్రాంతాల వద్ద ప్రాణహిత నది నిండు కుండను తలపించేలా ప్రవహిస్తోంది. నది పరివాహక ప్రాంతాల్లో వరద ఉధృతి పెరగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

వర్షాల కారణంగా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా పోలీసు, రెవెన్యూ శాఖ అధికారులు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. గోదావరి, ప్రాణహిత నదులు, వాగులు, వరద ప్రభావిత ప్రాంతాలకు ఎవరూ వెళ్లవద్దని ప్రజలను హెచ్చరిస్తూ అవగాహన కల్పిస్తున్నారు. వాతావరణ శాఖ సూచనల మేరకు మరో రెండు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను అవసరమైతే తరలించేందుకు పునరావాస కేంద్రాలను ముందస్తుగా సిద్ధం చేసినట్లు అధికారులు తెలిపారు.