రుణాల మంజూరులో బ్యాంకర్లు సహకరించాలి: ఎమ్మెల్యే బొజ్జు పటేల్
ఉట్నూర్, ఆంధ్రప్రభ: ప్రభుత్వం ఏజెన్సీ ప్రాంత రైతులు, మహిళా స్వయం సహాయక సంఘాలకు అందిస్తున్న రుణాలు సకాలంలో మంజూరు చేసేలా బ్యాంకర్లు సహకరించాలని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ కోరారు.
గురువారం సాయంత్రం ఉట్నూర్ ఎస్‌బీఐ శాఖ మేనేజర్ అఖిలేష్ వర్మ ఎమ్మెల్యేను ఆయన క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించి శాలువాతో సన్మానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, అర్హులైన రైతులు, మహిళా సంఘాలు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రుణాలు అందేలా బ్యాంకు అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల కింద మంజూరయ్యే రుణాల ప్రక్రియను వేగవంతం చేసి లబ్ధిదారులకు సకాలంలో అందించాలని కోరారు.
దీనికి స్పందించిన ఎస్‌బీఐ మేనేజర్ అఖిలేష్ వర్మ మాట్లాడుతూ, ప్రభుత్వ పథకాల కింద అర్హులైన లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రుణాలు సకాలంలో మంజూరు చేసేందుకు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యేకు హామీ ఇచ్చారు.
