వేములవాడ బస్‌స్టేషన్ ఆధునీకరణ
పనులకు మంత్రుల శంకుస్థాపన
బాసరకు కొత్త ఎక్స్‌ప్రెస్ బస్సు సేవ ప్రారంభం
వేములవాడ, ఆంధ్రప్రభ: వేములవాడ బస్‌స్టేషన్‌ను ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సహచర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌తో కలిసి గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా బస్‌స్టేషన్ ఆధునికీకరణతో ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలు అందుబాటులోకి వస్తాయని వారు పేర్కొన్నారు.

అనంతరం వేములవాడ–కోరుట్ల మీదుగా బాసరకు కొత్త ఎక్స్‌ప్రెస్ బస్సు సేవను మంత్రులు జెండా ఊపి ప్రారంభించారు. ఈ కొత్త సర్వీసుతో భక్తులు, ప్రయాణికులకు రాకపోకలు మరింత సులభతరం అవుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, సంజయ్ కుమార్, మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, ఆర్టీసీ ఎండీ వి.సి. సజ్జనార్ నాగిరెడ్డి, జిల్లా కలెక్టర్ గరీమా అగర్వాల్, జిల్లా ఎస్పీ, ప్రజాప్రతినిధులు, ఆర్టీసీ అధికారులు, పలువురు నాయకులు పాల్గొన్నారు.

