ఎడతెరిపి లేని వర్షాలతో ఉప్పొంగుతున్న వాగులు
కోటిలింగాల–ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు..
పెరుగుతున్న గోదావరి నీటిమట్టం
వెల్గటూర్, ఆంధ్రప్రభ : మండలంలో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు, కుంటలు, చెరువుల్లోకి భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో పలు చెక్‌డ్యామ్‌లు, మత్తడులపై నీరు ప్రవహిస్తూ జలకళ సంతరించుకున్నాయి.
అధిక వర్షాల కారణంగా కోటిలింగాల వద్ద గోదావరిలో ప్రవాహం పెరిగింది. దీంతో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరుతోంది. గోదావరిలో నీటిమట్టం క్రమంగా పెరుగుతుండటంతో అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
అలాగే వెల్గటూర్ పరిధిలోని కాళేశ్వరం లింక్-2లోకి కూడా భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో పెద్దవాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది.
వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. వాగులు, వంకలు దాటే సమయంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు.
