నాగర్‌కర్నూల్‌లో ఓటర్ల వివరాల నమోదు 99.59 శాతం పూర్తి

మిగిలిన వివరాలను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటీల్ ఆదేశం

నాగర్‌కర్నూల్, ఆంధ్రప్రభ : ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంలో భాగంగా చేపట్టిన డిజిటలైజేషన్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటీల్ గురువారం నాగర్‌కర్నూల్ పట్టణంలోని 116వ పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి పరిశీలించారు. అక్కడ జరుగుతున్న పనుల పురోగతిని తెలుసుకుని అధికారులకు పలు సూచనలు చేశారు.

116వ పోలింగ్ కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న బూత్ లెవల్ అధికారి (బీఎల్‌ఓ)తో మాట్లాడిన కలెక్టర్, ఓటర్ల వివరాల డిజిటలైజేషన్ ఎంత మేర పూర్తయిందో అడిగి తెలుసుకున్నారు. ఈ పోలింగ్ కేంద్ర పరిధిలో మొత్తం 1,276 మంది ఓటర్లు ఉండగా, వారిలో 99.25 శాతం మంది వివరాలను ఇప్పటికే డిజిటలైజేషన్ చేసినట్లు బీఎల్‌ఓ తెలిపారు. మిగిలిన కొద్దిమంది ఓటర్ల వివరాలను కూడా మరో రెండు రోజుల్లో పూర్తిచేస్తామని ఆమె కలెక్టర్‌కు వివరించారు.

అనంతరం నాగర్‌కర్నూల్ నియోజకవర్గం మొత్తం డిజిటలైజేషన్ పురోగతిపై ఆర్డీఓ అర్చనతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గంలోని 270 పోలింగ్ కేంద్రాల పరిధిలో మొత్తం 2,40,571 మంది ఓటర్లు ఉండగా, వారిలో 2,39,563 మంది వివరాల డిజిటలైజేషన్ పూర్తయిందని తెలిపారు. దీంతో మొత్తం ప్రక్రియలో 99.59 శాతం నమోదు పూర్తైనట్లు ఆర్డీఓ వివరించారు.

ఇంకా మిగిలి ఉన్న 1,008 మంది ఓటర్ల వివరాలను ప్రత్యేక క్షేత్రస్థాయి పరిశీలనలో భాగంగా ధ్రువీకరించి, అనంతరం ఆన్‌లైన్‌లో నమోదు చేయనున్నట్లు వెల్లడించారు. తాడూరు, నాగర్‌కర్నూల్ రూరల్ మండలాల్లో డిజిటలైజేషన్ ప్రక్రియ ఇప్పటికే వంద శాతం పూర్తయిందని తెలిపారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటీల్ మాట్లాడుతూ ప్రతి అర్హ ఓటరు వివరాలు ఎలాంటి పొరపాట్లు లేకుండా నమోదు కావాలని సూచించారు. డిజిటలైజేషన్ ప్రక్రియను పారదర్శకంగా, నిర్దేశిత గడువులో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఓటర్ల వివరాల నమోదు విషయంలో నిర్లక్ష్యానికి తావులేకుండా క్షేత్రస్థాయిలో అధికారులు నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలని సూచించారు.

జిల్లా కలెక్టర్ వెంట మున్సిపల్ చైర్మన్ తీగల సునేంద్ర, ఆర్డీఓ అర్చన, మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డి, తహసీల్దార్ తబితా రాణి, డీటీ కిరణ్ కుమార్, బూత్ లెవల్ అధికారులు, ఎన్నికల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.