బ్రిడ్జిపై వరద.. రాకపోకలకు బ్రేక్

రెబ్బెన, ఆంధ్రప్రభ: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలంలోని నంబాల వాగు బ్రిడ్జిపై వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రాకపోకలను పూర్తిగా నిలిపివేసినట్లు తహసీల్దార్ పి. సూర్యప్రకాశ్ తెలిపారు. మండలంలో కురుస్తున్న ఎడతెరిపి వర్షాల కారణంగా వాగులో నీటిమట్టం ప్రమాదకర స్థాయికి చేరి బ్రిడ్జిపై నుంచి వరద నీరు ప్రవహిస్తోందన్నారు. దీంతో ద్విచక్ర వాహనాలు, ఆటోలు, కార్లు, బస్సులు సహా ఎలాంటి వాహనాల రాకపోకలనూ పూర్తిగా నిషేధించినట్లు తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వరద నీటిని దాటే ప్రయత్నం చేయవద్దని ప్రజలను హెచ్చరించారు.

నంబాల, నారాయణపూర్, కిష్టాపూర్ గ్రామాల ప్రజలు తక్కలపల్లి మీదుగా ఉన్న ప్రత్యామ్నాయ మార్గాన్ని ఉపయోగించి రెబ్బెనకు వెళ్లాలని సూచించారు. వరద ఉధృతి తగ్గే వరకు నంబాల వాగు బ్రిడ్జి వైపు వెళ్లవద్దని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.


తహసీల్దార్ పి. సూర్యప్రకాశ్ ఆధ్వర్యంలో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ ఉదయ్ కిరణ్, పోలీసు సిబ్బంది, రెవెన్యూ అధికారులు బ్రిడ్జిని పరిశీలించారు. అలాగే మండలంలోని ముంపు ప్రాంతాలు, వాగులు, బ్రిడ్జిలను నిరంతరం పర్యవేక్షిస్తూ ప్రజలకు అవసరమైన సూచనలు చేస్తున్నారు. అత్యవసర పరిస్థితులు మినహా ప్రజలు బయటకు రావద్దని అధికారులు సూచించారు.