రాళ్లవాగుపై మళ్లీ నిలిచిన రాకపోకలు
క్యాజ్‌వే మునిగిపోవడంతో ప్రజలకు ఇబ్బందులు.. శాశ్వత వంతెన నిర్మించాలని డిమాండ్
మంచిర్యాల, ఆంధ్రప్రభ: గత మూడు రోజులుగా కురుస్తున్న ఎడతెరిపి లేని భారీ వర్షాలతో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని రంగపేట, పవర్ సిటీ ప్రాంతాలను కలిపే రాళ్లవాగుపై ఉన్న క్యాజ్‌వే వరద నీటిలో మునిగిపోయింది. దీంతో ఇరువైపులా రాకపోకలు పూర్తిగా నిలిచిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా మంచిర్యాల పట్టణ సీఐ ప్రమోద్‌రావు రాళ్లవాగు వద్ద భారీ గేట్లు ఏర్పాటు చేయించి, ఎవరూ వాగులోకి వెళ్లకుండా పోలీసు సిబ్బందితో గస్తీ నిర్వహిస్తున్నారు. ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాల్లోనే ప్రయాణించాలని సూచిస్తున్నారు.
స్థానికుల కథనం ప్రకారం, దశాబ్దాలుగా రాళ్లవాగుపై క్యాజ్‌వే మాత్రమే ఉండటంతో ప్రతి వర్షాకాలంలో వరద ఉద్ధృతికి అది మునిగిపోతూ రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. తాత్కాలిక మరమ్మతులతోనే సమస్యను పరిష్కరించడం జరుగుతోందని, శాశ్వత పరిష్కారం మాత్రం లభించడం లేదని వారు అంటున్నారు.
మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు హై లెవెల్ వంతెన నిర్మాణానికి చర్యలు ప్రారంభించినప్పటికీ, కొందరు ప్రతిపక్ష నాయకులు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో పనులు నిలిచిపోయాయని స్థానికులు పేర్కొంటున్నారు. నిర్మాణం మధ్యలో నిలిచిపోవడంతో ప్రతి భారీ వర్షానికి క్యాజ్వేపై వరద నీరు ప్రవహిస్తూ ప్రజల రాకపోకలకు ఆటంకం కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికైనా ఉన్నతాధికారులు చొరవ తీసుకుని రాళ్లవాగుపై శాశ్వత వంతెన నిర్మాణాన్ని పూర్తి చేసి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు కోరుతున్నారు.
