పత్తి పంట బీమాలో రైతులు తప్పనిసరిగా నమోదు కావాలి

  • కనపర్రులో ‘పొలం పిలుస్తుంది’ కార్యక్రమంలో వ్యవసాయ అధికారుల అవగాహన
  • జూలై 31 వరకు పత్తి బీమా నమోదు అవకాశం – ఎకరాకు రూ.1,900 ప్రీమియం
  • వరి, కంది, మిరప పంటలకూ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన వర్తింపు

నాదెండ్ల, ఆంధ్రప్రభ: మండలంలోని కనపర్రు గ్రామంలో నిర్వహించిన ‘పొలం పిలుస్తుంది’ కార్యక్రమంలో రైతులకు పంటల బీమాపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి టి. శ్రీలత మాట్లాడుతూ, పునర్వ్యవస్థీకరించిన వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం కింద పల్నాడు జిల్లాలో పత్తి పంటకు అగ్రికల్చర్ క్రాప్ ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా బీమా అమలు చేస్తున్నట్లు తెలిపారు.

ప్రస్తుత ఎల్‌నినో పరిస్థితుల దృష్ట్యా పత్తి సాగు చేస్తున్న ప్రతి రైతు తప్పనిసరిగా పంటల బీమా పథకంలో నమోదు చేసుకోవాలని సూచించారు. పత్తి పంట బీమా నమోదు కోసం జూలై 31, 2026 వరకు అవకాశం ఉందని, ఎకరాకు రూ.1,900 ప్రీమియం చెల్లించి బీమా పొందవచ్చని తెలిపారు.

అలాగే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద వరి పంటకు రూ.80, కంది పంటకు రూ.40, మిరప పంటకు రూ.360 చొప్పున ప్రీమియం చెల్లించి బీమా సదుపాయం పొందవచ్చని రైతులకు వివరించారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పంటలకు బీమా చేయించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణాధికారి జి.పీ. శ్రీనివాసరావు, గ్రామ వ్యవసాయ సహాయకురాలు జ్యోత్స్న, గ్రామ రైతులు పాల్గొన్నారు.