ఎస్‌ఐఆర్ సర్వే వేగవంతం చేయాలి: బీఆర్ఎస్ నాయకులు
మహాదేవపూర్, ఆంధ్రప్రభ : కాళేశ్వరం గ్రామంలో చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) సర్వే ప్రక్రియను వేగవంతం చేసి, అర్హులైన ప్రతి ఓటరు పేరు ఓటరు జాబితాలో నమోదయ్యేలా చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ మండల నాయకులు ఆడప సంతోష్, కాళేశ్వరం 2వ వార్డు సభ్యుడు నిట్టూరి మహేష్ కోరారు.
శనివారం కాళేశ్వరంలో నిర్వహిస్తున్న ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో పాల్గొన్న వారు మాట్లాడుతూ, ఎస్‌ఐఆర్ సర్వేలో తలెత్తుతున్న లోపాలను వెంటనే సరిదిద్ది ఓటరు జాబితాను పకడ్బందీగా రూపొందించాలని సూచించారు. సర్వే సిబ్బంది ప్రతి ఇంటికీ వెళ్లి సమగ్రంగా వివరాలు సేకరించాలని, అర్హత ఉన్న ఏ ఒక్క ఓటరు పేరు కూడా జాబితా నుంచి తొలగిపోకుండా చూడాలని కోరారు.
ఎస్‌ఐఆర్ సర్వేపై ప్రజల్లో ఉన్న సందేహాలను నివృత్తి చేయడంతో పాటు సమస్యలు ఎదుర్కొంటున్న వారికి తగిన సహాయం అందించాలని అన్నారు. సర్వే ప్రక్రియలో ప్రజలకు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు కాళేశ్వరం బీఆర్ఎస్ నాయకులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని తెలిపారు.
గ్రామంలోని పలు ప్రాంతాల్లో నెట్‌వర్క్ సమస్యల కారణంగా సర్వే ప్రక్రియకు ఆటంకాలు ఏర్పడుతున్నాయని పేర్కొన్నారు. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఎస్‌ఐఆర్ సర్వే గడువును మరికొంత కాలం పొడిగించాలని ఎన్నికల సంఘాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో బీఎల్‌ఏలు, బీఆర్ఎస్ నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
