రూ.3.50 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం..

పలు గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, గ్రామపంచాయతీ ప్రహరీ గోడ ప్రారంభం

రేగొండ, ఆంధ్రప్రభ : భూపాలపల్లి నియోజకవర్గంలోని రేగొండ మండలంలో రూ.3.50 కోట్ల వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు శనివారం ప్రారంభించారు.

రూపిరెడ్డిపల్లి, పోచంపల్లి, మడతపల్లి, పొనగండ్ల, గుడేపల్లి, పెద్దంపల్లి, గడిపల్లి, రేగొండ, రావులపల్లి, జూబ్లీనగర్, సుల్తాన్‌పూర్, గోరికొత్తపల్లి, నిజాంపల్లి, దామరంచపల్లి, విజయపల్లి తదితర గ్రామాల్లో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లు, డ్రైనేజీలను ప్రారంభించారు. అలాగే దమ్మన్నపేట గ్రామంలో నిర్మించిన గ్రామపంచాయతీ ప్రహరీ గోడను కూడా ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధుల నుంచి సుమారు రూ.2.50 కోట్లను అభివృద్ధి పనుల కోసం మంజూరు చేయించినట్లు తెలిపారు. గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, మెరుగైన రహదారి సౌకర్యాలతోనే గ్రామాల సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వ స్థలాల పరిరక్షణకు ప్రహరీ గోడల నిర్మాణం ఎంతో ఉపయోగపడుతుందని, భూపాలపల్లి నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో ఎంపీడీవో వెంకటేశ్వరరావు, తహసీల్దార్ శ్వేతారావు, జిల్లా నాయకులు గుటోజు కిష్టయ్య, నాయినేని సంపత్‌రావు, మోడెం ఉమేష్ గౌడ్, నడిపల్లి విజ్జన్‌రావు, ఎర్రబెల్లి రవీందర్‌రావు, సూరం వీరేందర్, మేకల భిక్షపతి, నాయకులు ఇప్పకాయల నరసయ్య, పున్నం రవి, సుధానబోయిన ఓం ప్రకాష్, మటిక సంతోష్, మొట్టే కిరణ్, పత్తి ప్రభాకర్, తోకల సురేందర్ రెడ్డి, గంగుల రమణారెడ్డి, ఏనుగు రవీందర్ రెడ్డి, సబ్బిడి సురేందర్ రెడ్డి, సర్పంచులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.